Nitish Kumar: ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగి హత్య.. సీఎం నితీశ్ కు రాజకీయ ఇబ్బందులు!

  • నితీశ్ కుమార్ నివాసానికి 2 కిలోమీటర్ల దూరంలో హత్య
  • రాష్ట్రంలో శాంతిభద్రతలపై నితీశ్ కు అదుపు లేదన్న బీజేపీ
  • అవినీతి కేసులు పెరిగి పోతున్నాయని వ్యాఖ్య
Indigo airlines executive murder brings troubles to Nitish Kumar

ఇండిగో ఎయిర్ లైన్స్ మేనేజర్ రూపేశ్ సింగ్ (44) హత్య బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు సరికొత్త సమస్యలు తీసుకొచ్చింది. ఇప్పటికే బీజేపీ, జేడీయూ మధ్య విభేదాలు పెరుగుతున్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ తరుణంలో... ఈ హత్య ఆయన ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. నితీశ్ పై బీజేపీ నేతలు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే నిన్న సాయంత్రం పాట్నాలోని తన ఇంటి బయట దుండగులు జరిపిన కాల్పుల్లో రూపేశ్ సింగ్ మృతి చెందాడు. ఈ ఘటన జరిగిన ప్రాంతం నితీశ్ కుమార్ నివాసానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గేటు వేసి ఉండటంతో తన ఇంటి ముందు కారులో వేచి ఉన్న ఆయనను దుండగులు కాల్చి చంపారు. అంతకు ముందు పాట్నాకు కరోనా వ్యాక్సిన్ వచ్చిన సమయంలో ఆయన విమానాశ్రయంలో కనిపించారు. దీంతో, రూపేశ్ ను దుండగులు ఎయిర్ పోర్ట్ నుంచి ఛేజ్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ హత్య నేపథ్యంలో నితీశ్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ ఎంపీ  వివేక్ ఠాకూర్ మాట్లాడుతూ, కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు గోపాల్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతలపై నితీశ్ కుమార్ కు అదుపు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నితీశ్ కుమార్ ప్రభుత్వం తమ బీజేపీ మద్దతుతో నడుస్తోందనే విషయం తమకు తెలుసని... అయితే మెరుగైన బీహార్ కోసం తాము మాట్లాడక తప్పడం లేదని అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దయనీయంగా ఉందని.. అవినీతి కేసులు కూడా పెరిగిపోతున్నాయని ఆయన విమర్శించారు. పోలీస్ వ్యవస్థపై ప్రభుత్వానికి పట్టు ఉన్నట్టు కనిపించడం లేదని అన్నారు. నితీశ్ నాలుగోసారి సీఎం అయితే శాంతిభద్రతలపై కఠినంగా పని చేస్తారని భావించామని.. కానీ ఆయనలో ఉదాసీనత కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించడం లేదని అన్నారు.

More Telugu News