Karnataka: కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ.. అసంతృప్త నేతలకు మంత్రి పదవులు

  • కొత్తగా ఏడుగురికి మంత్రులుగా అవకాశం
  • కొంత కాలంగా పార్టీలోనే అసంతృప్తిని ఎదుర్కొంటున్న యడియూరప్ప 
  • సీఎం పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం కూడా జరిగిన వైనం
Cabinet expansion in Karnataka

కర్ణాటకలోని యడియూరప్ప ప్రభుత్వం ఈరోజు మంత్రివర్గ విస్తరణను చేపట్టింది. ఏడుగురికి మంత్రివర్గంలో అవకాశం కల్పించింది. కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ జూజూభాయ్ వాలా ప్రమాణస్వీకారం చేయించారు. కొత్తగా మంత్రులుగా అవకాశం దక్కిన వారిలో ఎస్.అంగర, ఉమేశ్ కట్టి, అరవింద్ లింబావలి, మురుగేశ్ నిరానీ, ఆర్.శంకర్, ఎంటీబీ నాగరాజ్, సీపీ యోగేశ్వర్ ఉన్నారు. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు కాగా, ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. 2019లో ముఖ్యమంత్రిగా యడియూరప్ప బాధ్యతలను స్వీకరించిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించడం ఇది మూడోసారి.

కాంగ్రెస్-జేడీఎస్ కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు బయటకు రావడంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. వీరంతా బీజేపీకి మద్దతు పలకడంతో యడియూరప్ప సీఎం అయ్యారు. అయితే, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యడ్డీకి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. సొంత పార్టీలోనే అసంతృప్తి పెరిగిపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకానొక సమయంలో సీఎం పదవి నుంచి యడ్డీని తొలగిస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో, మంత్రివర్గ విస్తరణ జరిగింది. దీంతో, యడ్డీకి కొంత కాలం పాటు ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చని భావిస్తున్నారు.

More Telugu News