ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానానికి పడిపోయిన కోహ్లీ

13-01-2021 Wed 19:46
  • బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో విలియంసన్
  • టాప్ టెన్ లో ముగ్గురు ఇండియన్లు
  • ఆల్ రౌండర్ల జాబితాలో రెండో స్థానంలో జడేజా
Kohli drops to 3rd place in ICC rankings

ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగులు విడుదలయ్యాయి. బ్యాట్స్ మెన్ ర్యాంకింగుల్లో ఇండియా ఆటగాళ్లు ముగ్గురు స్థానం సంపాదించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో స్థానం దిగజారాడు. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మీత్ రెండో స్థానానికి ఎగబాకాడు. దీంతో, కోహ్లీ మూడో స్థానానికి పడిపోయాడు. తొలి స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ కొనసాగుతున్నాడు.

తన భార్య అనుష్క శర్మ డెలివరీ కోసం విరాట్ కోహ్లీ లీవ్ తీసుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టు ఆడిన కోహ్లీ భార్య డెలివరీ సమయంలో పక్కనే ఉండాలనే కోరికతో ఇండియాకు తిరిగొచ్చాడు. ఆ తర్వాత జరిగిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఈ ర్యాంకింగుల్లో అజింక్య రహానే ఏడో స్థానంలో, చటేశ్వర్ పుజారా ఎనిమిదో స్థానంలో ఉన్నారు.

ఆల్ రౌండర్ల జాబితాలో ఇండియా నుంచి ఇద్దరు టాప్ టెన్ లో నిలిచారు. రవీంద్ర జడేజా ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని రెండో ప్లేస్ లో నిలిచాడు. అశ్విన్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో అశ్విన్ 9వ స్థానంలో, జస్ప్రీత్ బుమ్రా 10వ స్థానంలో ఉన్నారు.