డీజీపీకి నా సూటి ప్రశ్న.. టీఆర్ఎస్ కు నీ పోలీసులు చెప్పులుగా మారిండ్రా?: బీజేపీ నేత మురళీధర్ రావు

13-01-2021 Wed 16:24
  • వివేకానంద సందేశాన్ని ప్రచారం చేస్తున్న వారిని కొడతారా?
  • క్రిమినల్స్, జేబు దొంగలను కూడా ఇంత దారుణంగా కొట్టరు
  • టీఆర్ఎస్ అజెండాను అమలు చేస్తున్న పోలీసులపై క్రిమినల్ కేసులు పెట్టాలి
Muralidhar Raos sensational comments on TS DGP

జనగాంలో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన ఘటనపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బాధితులపై సీఎం కేసీఆర్ కఠిన చర్యలు తీసుకోకపోతే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీపై ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'తెలంగాణ డీజీపీకి నా సూటి ప్రశ్న. నీ హయాంలో, నీ కమాండ్ కింద ఉన్న పోలీసు బలగాలు రాజ్యాంగ రక్షణ కోసం ఉన్నట్టా? లేదా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెప్పులుగా మారిండ్రా? స్వామి వివేకానంద సందేశాన్ని ప్రచారం చేస్తున్న వాళ్లని కొట్టడం రాజ్యాంగంపై మీకు ఎంత అంకితభావం ఉందో నిరూపిస్తోంది.

క్రిమినల్స్ ను, జేబు దొంగలను కూడా కొట్టనంత దారుణంగా స్వామి వివేకానంద జయంతి జరుపుకోవడానికి హోర్డింగులు, ఫ్లెక్సీలు పెట్టినందుకు బీజేపీ కార్యకర్తలను కొట్టడం దారుణం. టీఆర్ఎస్ రాజకీయ అజెండాను అమలు చేస్తున్న పోలీసుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా' అని మురళీధర్ రావు ట్వీట్ చేశారు.