Corona Warriors: కరోనా యోధులన్నారు.. చెప్పాపెట్టకుండా ఉద్యోగాలు పీకేశారు!

  • 700 మంది పారిశుద్ధ్య కార్మికులను తొలగించిన తమిళనాడు సర్కార్
  • నోటీసులివ్వకుండానే తీసేశారన్న కార్మికులు
  • కరోనా సోకినా పరిహారం ఇవ్వలేదని ఆవేదన
  • మంచి కానుకే ఇచ్చారంటూ సర్కారును ఎద్దేవా చేసిన కనిమొళి
Sanitation workers left in lurch after 700 Covid warriors asked to leave without notice in Tamil Nadu

కరోనా టైంలో చెత్తాచెదారం తీసుకెళ్తుంటే.. 'ముందు వరుస యోధులు' అని వాళ్లను పొగిడారు. దండలు వేసి, చప్పట్లు కొట్టి నెత్తిన పెట్టుకున్నారు. కానీ, ఆ యోధులనే ఇప్పుడు చెప్పాపెట్టకుండా ఉద్యోగం నుంచి తీసేశారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 700 మంది పారిశుద్ధ్య కార్మికులను పని నుంచి తొలగించారు. తమిళనాడు ప్రభుత్వం చేసిందీ నిర్వాకం. ‘మీ సేవలు ఇక అవసరం లేదు’ అంటూ జనవరి 11న వారికి తమిళనాడు సర్కారు షాకిచ్చింది.

ఉద్యోగం చేసి కరోనా సోకినా తమను ప్రభుత్వం ఆదుకోలేదని, కనీసం ఇస్తామన్న పరిహారం కూడా ఇవ్వలేదని వాళ్లంతా ఆరోపించారు. ఉన్నట్టుండి తమను ఉద్యోగం నుంచి తీసేస్తే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా టైంలో తన భర్తకు ఉపాధి పోయిందని, ముగ్గురు ఆడపిల్లలు ఇంటిపట్టునే ఉండిపోయారని శివశంకరి అనే మహిళా కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ టైంలో తాను సంపాదించేదాంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చానని చెప్పింది. అక్టోబర్ 9న తనకూ కరోనా సోకిందని, ఆస్పత్రిలో చికిత్స చేయించుకునే స్థితిలో కూడా లేనని పేర్కొంది. దాదాపు మూడు నెలల పాటు కరోనాతో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. సెలవు కావాలంటే ఒక నెల మాత్రమే ఇచ్చారని, ఇప్పుడేమో ఉద్యోగం నుంచి అసలే తీసేశారని శివశంకరి కన్నీటి పర్యంతమైంది.

ఇలా ఆమె ఒక్కతే కాదు.. దాదాపు ఉద్యోగం కోల్పోయిన వాళ్లందరివీ అవే బాధలు. ప్రతాప్ అనే మరో ఒప్పంద కార్మికుడికీ గత ఏడాది మార్చిలో వైరస్ సోకింది. దాని బారి నుంచి వెంటనే బయటపడి.. ఉద్యోగంలో చేరాడు. కానీ, ప్రభుత్వం నుంచి మాత్రం పరిహారం అందలేదు. కేవలం శాశ్వత ఉద్యోగులకే పరిహారం ఇస్తామంటూ అధికారులు చెప్పారని అతడు ఆవేదన చెందాడు. ఎన్ని కష్టానష్టాలున్నా పనిచేస్తున్నామని, ఇప్పుడు హఠాత్తుగా 700 మందిని ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పాడు. పది పన్నెండేళ్లుగా రాత్రింబవళ్లన్న తేడా లేకుండా పనిచేస్తున్నామని, వార్ధా, నివర్ తుఫాన్లప్పుడు, కరోనా సమయంలోనూ రెండ్రెండు షిఫ్టుల్లో పనిచేశామన్నాడు. ఉద్యోగం కోల్పోయిన వారిని ఎవరిని కదిలించినా ఇదే గోడు వినిపిస్తున్నారు.

పారిశుద్ధ్య కార్మికులను తొలగించడం పట్ల డీఎంకే సీనియర్ నేత, ఎంపీ కనిమొళి మండిపడ్డారు. కరోనా యోధులను దేశమంతా పూజిస్తుంటే.. పళనిస్వామి ప్రభుత్వం మాత్రం 700 మంది ఉద్యోగాలను తీసేసిందంటూ విమర్శించారు. నిరుద్యోగ సమస్య వేధిస్తున్న ఇలాంటి తరుణంలో ఎలాంటి నోటీసులూ లేకుండా ఉద్యోగాలు పీకేయడం చాలా క్రూరమైన చర్య అని మండిపడ్డారు. కరోనా కాలంలో ప్రజలంతా వాళ్లమీదే ఆధారపడ్డారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సంక్రాంతి పండుగకు ముందు ప్రభుత్వం వాళ్లకు మంచి కానుకనే ఇచ్చిందని కనిమొళి ఎద్దేవా చేశారు.

More Telugu News