కిడ్నాప్ చేసిన వారికి 'స్పెషల్ 26' సినిమాను చూపించిన అఖిలప్రియ సోదరుడు!

13-01-2021 Wed 11:52
  • సంచలనం కలిగించిన కిడ్నాప్ కేసు
  • మరిన్ని వివరాలు వెలుగులోకి తెచ్చిన పోలీసులు
  • సినిమా చూపించి కిడ్నాపర్లకు శిక్షణ
Special 26 is the Movie behind Trainign to Kidnapers

హైదరాబాద్ పరిధిలోని బోయిన్ పల్లిలో సంచలనం కలిగించిన కిడ్నాప్ కేసులో, మరిన్ని విషయాలను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో తమ విరోధులను కిడ్నాప్ చేయాలని భావించిన అఖిలప్రియ కుటుంబం, ఇందులో పాల్గొన్న వారికి ముందుగానే శిక్షణ ఇచ్చిందని తెలిపారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటించిన 'స్పెషల్ 26'ను కిడ్నాపర్లకు చూపించి, వారికి ఐటీ అధికారులుగా ఎలా నటించాలన్న విషయమై తర్ఫీదు ఇచ్చారు.

దాదాపు వారం రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. సినిమాను చూపిస్తూ, యూసుఫ్ గూడలోని ఎంజీఎం స్కూల్ లో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ సోదరుడు చంద్రహాస్ కిడ్నాపర్లకు శిక్షణ ఇచ్చాడని, ఆపై అఖిలప్రియ గ్రీన్ సిగ్నల్ తోనే ఈ తతంగమంతా సాగిందని పోలీసులు తేల్చారు. ఇందుకోసం కిడ్నాపర్లు వేసుకునేందుకు ఇందిరానగర్ లోని ఓ డ్రస్సులు అద్దెకిచ్చే దుకాణం నుంచి ఐటీ అధికారుల్లా కనిపించేలా దుస్తులను అద్దెకు తీసుకున్నారని, వారి ఐడీ కార్డులను చంద్రహాస్ తయారు చేయించారని పోలీసులు గుర్తించారు.