కాసేప‌ట్లో జ‌న‌గామకు బండి సంజ‌య్.. ఉద్రిక్త వాతావ‌ర‌ణం

13-01-2021 Wed 11:36
  • బీజేపీ కార్యకర్తలపై సీఐ మల్లేశ్ లాఠీఛార్జ్
  • సీఐపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని సంజ‌య్ డిమాండ్
  • బండి సంజ‌య్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో భారీగా  పోలీసుల మోహ‌రింపు
bandi sanjay to reach janagama

జనగామ మునిసిపల్ కార్యాలయం ముందు ధ‌ర్నాకు దిగిన  బీజేపీ కార్యకర్తలపై సీఐ మల్లేశ్ లాఠీఛార్జ్  చేశార‌ని బీజేపీ నేత‌లు మండిపడుతోన్న విష‌యం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో మండిపడుతున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కాసేప‌ట్లో జనగామ పర్యటనకు బ‌యలుదేర‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం చెల‌రేగే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి.

మొద‌ట ఆయ‌న‌ జనగామ పోలీసుల దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను క‌లిసి ధైర్యం చెప్ప‌నున్నారు. జనగామ సీఐపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఛలో జనగామకు పిలుపునిచ్చారు. మ‌రి కాసేపట్లో జనగామకు బండి సంజయ్ రానున్న నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు మోహరించడంతో ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది. సీఐపై చర్యలు తీసుకోకుంటే తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని బీజేపీ నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు.