Corona Virus: వ్యాక్సినేషన్‌లో దుష్ఫలితాలు తలెత్తితే చికిత్సకు.. 1200 పడకలు, 720 వాహనాలను సిద్ధం చేసిన ప్రభుత్వం

Telangana govt taken prior steps ahead of vaccination
  • వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణ సమాయత్తం
  • దుష్ఫలితాలు తలెత్తితే ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు
  • జ్వరం, చిరాకు, అస్వస్థత వంటి లక్షణాలు కనిపించే అవకాశం
  • మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
కరోనా టీకా పంపిణీకి సిద్ధమవుతున్న తెలంగాణ.. ఒకవేళ దుష్ఫలితాలు తలెత్తినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉంది. టీకా వేసిన తర్వాత స్వల్పంగా దుష్ఫలితాలు వెలుగు చూస్తే వెంటనే చికిత్స అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

 సమస్య తీవ్రతను బట్టి వైద్య సేవలు అందించేందుకు 235 ఆసుపత్రులను ఎంపిక చేసింది. ఇందులో 57 ప్రభుత్వ ఆసుపత్రులు, 178 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. అలాగే, మొత్తంగా 1200 పడకలను సిద్ధం చేసింది. దుష్ఫలితాలు ఎదురైతే ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై ప్రభుత్వం నిన్న మార్గదర్శకాలు జారీ చేసింది.

కరోనా టీకా తీసుకున్న తర్వాత కొందరిలో జ్వరం, చిరాకు, ఇంజెక్షన్ తీసుకున్న ప్రదేశంలో నొప్పి, వాపు, ఏదో తెలియని అసౌకర్యం, అస్వస్థత వంటి లక్షణాలు కనిపిస్తే, మరికొందరిలో తీవ్ర అలెర్జీ, 102 డిగ్రీలకు పైగా జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలకు ఆసుపత్రిలో చికిత్స అవసరం లేకుండానే కోలుకోవచ్చు.

మరికొందరిని మాత్రం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ఇవ్వాల్సి రావొచ్చు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దుష్ఫలితాలు తలెత్తితే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అత్యవసరంగా 20 వేల ప్రత్యేక కిట్లను సిద్ధం చేసింది. ఒక్కో కేంద్రంలో ఒక్కో కిట్ అందుబాటులో ఉంటుంది. అలాగే, రోగులను అత్యవసరంగా తరలించేందుకు 720 వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు.
Corona Virus
Covid Vaccine
Telangana

More Telugu News