అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ అరెస్ట్... రహస్య ప్రదేశంలో విచారణ!

13-01-2021 Wed 08:45
  • ప్రస్తుతం భార్గవ్ రామ్ ను విచారిస్తున్న పోలీసులు
  • కిడ్నాప్ సూత్రధారులు, పాత్రధారులపై ప్రశ్నలు
  • రేపటితో ముగియనున్న అఖిలప్రియ కస్టడీ
Akhilapriya Husbend Bhargav Ram Arrested

హైదరాబాద్, బోయిన్ పల్లిలో జరిగిన ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. అతన్ని ప్రస్తుతం ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, కిడ్నాప్ కేసులో సూత్రధారులు, పాత్రధారుల గురించిన వివరాలను భార్గవ్ రామ్ నుంచి రాబడుతున్నట్టు తెలిసింది.

ఈ కేసులో మొత్తం 19 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొనగా, ఇప్పటివరకూ 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా 11 మందిలో భార్గవ్ రామ్ తో పాటు, గుంటూరు శ్రీను తదితరులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరిలో భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో 10 మంది ఆచూకీపై పోలీసులు ఇప్పటికే విశ్వసనీయ సమాచారం అందుకుని, కొందరిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది.

పలు ప్రాంతాలకు వెళ్లిన తెలంగాణ పోలీసు బృందాలు నిన్న గోవాలో ఒకరిని, కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన వంశీ, సాయి హర్షతో పాటు భాను అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ ప్రమేయంపైనా పోలీసులకు ఆధారాలు అందినట్టు తెలుస్తోంది. జగత్ కారు డ్రైవరే కిడ్నాప్ లో పాల్గొన్నట్టు సమాచారం.

ఇదిలావుండగా, అఖిలప్రియ రెండో రోజు పోలీసు కస్టడీ ముగిసింది. నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్ వార్ నేతృత్వంలో న్యాయవాదుల సమక్షంలో ఉన్నతాధికారులు అఖిలప్రియను విచారించారు. రేపు మధ్యాహ్నంతో ఆమె కస్టడీ ముగియనుంది.