బ్రెజిల్‌కు మన కరోనా టీకా కొవాగ్జిన్!

13-01-2021 Wed 08:24
  • ‘ప్రిసిసా’తో భారత్ బయోటెక్ ఒప్పందం
  • కొవాగ్జిన్ టీకాను తమకు సరఫరా చేయాలని కోరిన బ్రెజిల్ రాయబారి
  • ‘అన్విసా’ నుంచి అనుమతి రాగానే సరఫరా
Bharat Biotech to supply Covaxin vaccine to Brazil

మన కరోనా టీకా కొవాగ్జిన్ బ్రెజిల్‌కు ఎగుమతి కానుంది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన ప్రిసిసా మెడికమెంతోస్ అనే సంస్థతో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. బ్రెజిల్ బృందం గత వారం  హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ యూనిట్‌ను సందర్శించింది. ఆ సంస్థ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లతో సమావేశమైంది.

ఈ సందర్భంగా భారత్‌లోని బ్రెజిల్ రాయబారి ఆండ్రే ఆరాన్హ కోరె డా లాగో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్ కృష్ణతో మాట్లాడారు. తమ దేశానికి కూడా కొవాగ్జిన్ టీకాను సరఫరా చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో రెండు సంస్థల మధ్య టీకా సరఫరాకు సంబంధించి ఒప్పందం కుదిరింది. బ్రెజిల్ ఔషధ నియంత్రణ సంస్థ ‘అన్విసా’ నుంచి కొవాగ్జిన్‌కు అనుమతి లభించిన వెంటనే సరఫరా ప్రారంభమవుతుందని భారత్ బయోటెక్ పేర్కొంది.