దేవుళ్ల డబ్బుని నవరత్నాలకి వినియోగించే హక్కు ఎవరిచ్చారు?: టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి

12-01-2021 Tue 20:06
  • గోత్రం లేని జగన్ కు మతాల గురించి ఏం తెలుసు? 
  • ముస్లింల సంక్షేమానికి వాడాల్సిన నిధులను కూడా తరలించారు
  • నిధుల బదిలీకి సంబంధించిన జీవో కాపీల ప్రదర్శన 
Jagan diverting Hindu Gods money for Navaratnalu says Anam Venkaratamana Reddy

ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోత్రం లేని జగన్ కి మతాల గురించి ఏం తెలుసని ఆయన మండిపడ్డారు. దేవాదాయశాఖ నిధులను బ్రాహ్మణ కార్పొరేషన్ కు, అక్కడి నుంచి పీడీ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేశారని... ఆ అకౌంట్ల నుంచి డబ్బును డ్రా చేసి నవరత్నాల కార్యక్రమానికి తరలించారని ఆరోపించారు.

ఈ డబ్బు ఆలయాలకు హిందువులు ఇచ్చినదని... దేవుళ్ల డబ్బును నవరత్నాలకు వినియోగించే హక్కు జగన్ కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ముస్లింల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన మైనార్టీ వెల్ఫేర్ నిధులను కూడా నవరత్నాలకు మరల్చారని విమర్శించారు. ఈ నిధుల బదిలీకి సంబంధించిన జీవో కాపీలను మీడియా ముందు ఆనం ప్రదర్శించారు. వైసీపీ మేనిఫెస్టోను పవిత్రమైన మత గ్రంథాలతో ఎలా పోలుస్తారంటూ జగన్ పై మండిపడ్డారు.