ఎస్ఈసీ పిటిషన్ విచారణను వాయిదా వేసిన హైకోర్టు డివిజన్ బెంచ్

12-01-2021 Tue 19:07
  • అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదన్న హైకోర్టు
  • రెగ్యులర్ కోర్టులో వాదనలు వింటామని వ్యాఖ్య
  • తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా
AP HC adjourns Panchayat elections petition hearing

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ వేసిన పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో షెడ్యూల్ ని రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో డివిజన్ బెంచ్ లో దీన్ని సవాల్ చేస్తూ ఎస్ఈసీ పిటిషన్ వేశారు.

ఎస్ఈసీ తరపున లాయన్ అశ్విన్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే పంచాయతీ ఎన్నికల రద్దు ఆదేశాలపై అత్యవసరంగా విచారణ జరిపించాల్సిన అవసరం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నెల 17 వరకు హైకోర్టుకు సెలవులు ఉన్నాయని... ఆ తర్వాత 18న రెగ్యులర్ కోర్టులో వాదనలు వింటామని చెప్పింది.

కేసు విచారణ సందర్భంగా మొదట లాయర్ అశ్విన్ కుమార్ వాదిస్తూ, కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉందని... ఈనెల 23న తొలి దశ ఎన్నికలను నిర్వహించాల్సి ఉందని తెలిపారు. స్టే ఇవ్వడం వల్ల ఎన్నికల నిర్వహణలో జాప్యం కలుగుతుందని అన్నారు. ఎన్నికలను నిర్వహిస్తున్నారా? లేదా? అని అడుగుతూ ఇప్పటికే 4 వేల మెయిల్స్ వచ్చాయని చెప్పారు. అయినా కేసును అత్యవసరంగా విచారించేందుకు హైకోర్టు ఒప్పుకోలేదు. తరుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.