Telugudesam: టీడీపీకి భారీ షాక్.. క్రిస్టియన్ సెల్ నేతల మూకుమ్మడి రాజీనామాలు

  • చంద్రబాబు వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసిన క్రిస్టియన్ సెల్ నేతలు
  • మత మార్పిడులు ఎక్కడ జరుగుతున్నాయో చంద్రబాబు చెప్పాలని డిమాండ్
  • పాస్టర్లకు 5 వేల వేతనం ఇస్తే తప్పేముందని వ్యాఖ్య  
Christian cell leaders resigns to TDP

తెలుగుదేశం పార్టీకి చెందిన క్రిస్టియన్ సెల్ నేతలంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే వారంతా పార్టీకి గుడ్ బై చెప్పారు.

ఈ సందర్భంగా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని చెప్పారు. క్రైస్తవ సమాజాన్ని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు గతంలో ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని... చర్చిలకు కూడా వెళ్లి అనేక సార్లు ప్రార్థనలు చేశారని చెప్పారు.

పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేల వేతనాన్ని ఇస్తే దాన్ని చంద్రబాబు తప్పుపట్టడం దేనికని ప్రవీణ్ ప్రశ్నించారు. క్రైస్తవంలోకి బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారని... మతమార్పిడులు ఎక్కడ జరుగుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఎప్పటి నుంచో చర్చిలు ఉన్నాయని... వాటిని ఇప్పుడే కొత్తగా ఏర్పాటు చేసినట్టు చంద్రబాబు చెపుతున్నారని విమర్శించారు.

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదని... అందుకే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నామని చెప్పారు. మరోవైపు వీరంతా వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News