Jasprit Bumrah: ఇండియాకు మరో షాక్​.. నాలుగో టెస్టుకు బుమ్రా కూడా ఔట్​!

  • పొత్తికడుపు గాయంతో మిస్ అయ్యే చాన్స్
  • ఆడించకూడదని భావిస్తున్న టీమిండియా మేనేజ్ మెంట్
  • అతడి స్థానంలో నటరాజన్ లేదా శార్దూల్ కు చాన్స్
Injured Bumrah set to miss Brisbane Test

బోర్డర్–గవాస్కర్ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ కు ముందు భారత్ కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పటికే బొటనచేతి వేలిగాయంతో రవీంద్ర జడేజా మ్యాచ్ కు దూరమయ్యాడు. సిడ్నీలో జరిగిన మూడో టెస్టు డ్రా కావడంలో కీలక పాత్ర పోషించిన హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ లూ దాదాపు దూరమైనట్టేనంటున్నారు. తాజాగా ఇండియా పేస్ దళాన్ని భుజాన మోస్తున్న జస్ ప్రీత్ బుమ్రా కూడా బ్రిస్బేన్ లో జనవరి 15 నుంచి జరగాల్సి ఉన్న నాలుగో టెస్టుకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది.

పొత్తికడుపు కండర గాయంతో బాధపడుతున్న బుమ్రాను మ్యాచ్ ఆడించి రిస్క్ తీసుకోవద్దన్న ఆలోచనలో టీమిండియా యాజమాన్యం ఉంది. మూడో టెస్టు సందర్భంగా అతడు పొత్తికడుపు సమస్యకు సంబంధించి బాగా ఇబ్బంది పడ్డట్టు కనిపించాడు. కాసేపు మైదానాన్నీ వీడాడు. ఫిజియోతో చికిత్స తీసుకున్నాక మళ్లీ ఆడాడు. మొత్తంగా మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 87 ఓవర్లు బౌల్ చేసింది. అందులో గాయంతోనే 25 ఓవర్లు ఒక్క బుమ్రానే వేశాడు.

ఈ నేపథ్యంలోనే అతడి విషయంలో రిస్క్ తీసుకోకూడదని మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఒకవేళ అతడు చివరి టెస్ట్ మ్యాచ్ కు మిస్ అయితే.. అనుభవం లేని బౌలింగ్ దళంతో భారత్ కు ఇబ్బందులు తప్పేలా కనిపించట్లేదు. బుమ్రా స్థానంలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ అయినా ఆడని నటరాజన్, శార్దూల్ ఠాకూర్ లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఇక, అశ్విన్ కూడా దూరమైతే అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కే వీలుంది.

More Telugu News