ఐరాస భద్రతా మండలిలో మళ్లీ భారత్​ కు మోకాలడ్డిన చైనా!

12-01-2021 Tue 12:17
  • అల్ ఖాయిదా ఆంక్షల కమిటీకి నేతృత్వం వహించకుండా అడ్డుపుల్ల
  • ఈ సారి నుంచి నార్వేకి బాధ్యతలు
  • తాలిబాన్, ఉగ్రవాద వ్యతిరేక కమిటీలకే భారత్ పరిమితం
  • ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధించే అధికారం ఉండదంటున్న నిపుణులు
China worked to prevent India from chairing key UNSC terrorism related body

అడుగడుగునా భారత్ కు చైనా అడ్డుపడుతూనే ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం రాకుండా అడ్డుపుల్ల వేస్తున్న డ్రాగన్ దేశం.. తాజాగా అదే భద్రతా మండలిలో కీలక కమిటీకి భారత్ నేతృత్వం వహించకుండా మోకాలడ్డింది. మిగతా శాశ్వత సభ్య దేశాలు భారత్ నేతృత్వానికి సమ్మతం తెలిపినా.. చైనా మాత్రం ఒప్పుకోలేదు. దీంతో ఉగ్రవాదంపై పోరుకు నియమించిన అల్ ఖాయిదా ఆంక్షల కమిటీకి నేతృత్వం వహించే అవకాశం భారత్ కోల్పోయినట్టయింది.

అయితే, తాలిబాన్, లిబియా ఆంక్షల కమిటీలు, ఉగ్రవాద వ్యతిరేక కమిటీలకు మాత్రం మన దేశమే నేతృత్వం వహించనుంది. ఈ మేరకు పీ 5 (ఐదు శాశ్వత సభ్య దేశాలు)కి చెందిన ఓ దౌత్యాధికారి ఈ విషయాలను ధ్రువీకరించారు. చైనా వ్యతిరేకించడంతో అన్ని కమిటీల ప్రకటనలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఆ అధికారి చెప్పారు. అయితే, ఉగ్రవాద వ్యతిరేక కమిటీకి మాత్రం ఇండియానే నాయకత్వం వహిస్తుందని, వచ్చే ఏడాది నుంచి ఆ బాధ్యతలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. చైనా ఒక్కటే భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడిందని మరో దౌత్యాధికారి తెలిపారు.

చైనా వ్యతిరేకించడంతో తాలిబాన్, అల్ ఖాయిదా ఆంక్షల కమిటీలకు వేర్వేరు దేశాలు నేతృత్వం వహించనున్నాయి. తాలిబాన్ కమిటీకి మన దేశం నాయకత్వం వహిస్తే.. అల్ ఖాయిదా కమిటీ బాధ్యతలను నార్వే తీసుకోనుంది. అయితే, అల్ ఖాయిదా దాని అనుబంధ ఉగ్రవాద సంస్థల ఆంక్షల కమిటీకి నేతృత్వం వహించడం భారత్ కు చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు.

సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ ను దోషిగా నిలబెట్టేందుకు భారత్ అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు కూడగడుతోంది. ఇలాంటి సమయంలో అల్ ఖాయిదా కమిటీకి దూరం కావడం నష్టం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఒక్క ఉగ్రవాద వ్యతిరేక కమిటీకి నేతృత్వం వహించడం వల్ల ఒరిగేదేమీ ఉండదంటున్నారు. హింసాత్మక తీవ్రవాదం, విదేశీ ఉగ్రవాదులు, ఉగ్రవాద నిధులపై మాత్రమే అధికారాలుంటాయని, ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధించే అధికారం ఉండదని చెబుతున్నారు.

ఇంతకుముందు జేఈఎం (జైషే మహ్మద్) ఉగ్రవాద సంస్థ అధిపతి అయిన మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి గుర్తించడంలో భారత్ దే కీలక పాత్ర. అయితే, దానిపైనా పాక్ మద్దతుతో చైనా అడుగడుగునా అడ్డంకులే సృష్టించింది. మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా నాలుగుసార్లు అడ్డుపడింది. దీంతో ఉగ్రవాదం విషయంలో చైనా ‘ద్వంద్వ వైఖరి’పై భారత్ మండిపడింది.