బ‌‌ర్డ్ ఫ్లూ భయం నేపథ్యంలో త‌గ్గిన‌ చికెన్ ధ‌ర‌లు

12-01-2021 Tue 12:11
  • న‌ష్టాల బాటలో పౌల్ట్రీ మార్కెట్  
  • మహారాష్ట్రలో కిలో చికెన్ ధర రూ.58
  • గుజరాత్‌లో రూ.65  
chicken rates down in india

దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా బ‌‌ర్డ్ ఫ్లూ విజృంభిస్తోన్న విష‌యం తెలిసిందే.  
యూపీ‌, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, గుజరాత్, మ‌హారాష్ట్ర‌ల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ప‌లు ప్రాంతాల్లో కోళ్లు మృతి చెందుతుండడంతో ప్ర‌జ‌లు కోడి మాంసం తినాలంటేనే జంకుతున్నారు.

దీంతో పౌల్ట్రీ మార్కెట్ పూర్తిగా న‌ష్టాల బాట ప‌డుతోంది. ప్ర‌స్తుత సీజ‌న్ లో సాధార‌ణంగా చికెన్, గుడ్లకు బాగా డిమాండ్ ఉంటుంది. అయితే, బ‌ర్డ్ ఫ్లూ కార‌ణంగా ఈ ప‌రిస్థితులు భిన్నంగా మారాయి. ప్ర‌జ‌ల నుంచి కొనుగోళ్లు లేక‌పోవ‌డంతో చికెన్, గుడ్ల ధరలు భారీగా ప‌డిపోయాయి. ప‌లు రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర రూ.60 రూపాయల క‌న్నా త‌క్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

మహారాష్ట్రలో కిలో చికెన్ ధర రూ.58, గుజరాత్‌లో రూ.65, తమిళనాడులో రూ. 70కి ప‌డిపోయింది. తమిళనాడులోని నమక్కల్‌లో ఒక గుడ్డు ధర రూ.4.20కి చేరింది. హ‌ర్యానాలో రూ.4.05, పూణెలో రూ. 4.50గా ఉంది. ఇంత‌కు ముందు ఆయా ప్రాంతాల్లో గుడ్ల ధ‌ర‌లు 5 రూపాయల కంటే అధికంగా ఉండేవి.