హైకోర్టు జడ్జీలలో ఇంతవరకు మా వాళ్లు 13 మందేనా?: వాపోయిన పీఎంకే నేత రాందాస్

12-01-2021 Tue 10:37
  • ఉద్దేశపూర్వకంగానే మా సామాజిక వర్గాన్ని దూరం పెడుతున్నారు
  • రాష్ట్రంలోని అత్యధిక జనాభాలో వన్నియర్ కులం కూడా ఒకటి
  • మా సామాజిక వర్గంలో వందలాదిమంది న్యాయవాదులు ఉన్నారు
PMK chief Ramdas worries about his caste

హైకోర్టులో తమ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యమే కరవైందంటూ తమిళనాడులోని పట్టాలి మక్కల్ కచ్చి (పీఎంకే) అధినేత డాక్టర్ రాందాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండున్నర దశాబ్దాలలో కేవలం 13 మంది మాత్రమే తమ సామాజిక వర్గం నుంచి న్యాయమూర్తులుగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గాలలో వన్నియార్ కులం కూడా ఒకటని, అయినప్పటికీ తమ వారికి హైకోర్టులో సరైన ప్రాధాన్యం దక్కకపోవడం విచారకరమని అన్నారు.

వన్నియార్లలో వందలాదిమంది న్యాయవాదులు, న్యాయాధికారులు ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగానే వారిని అధికారానికి దూరంగా ఉంచుతున్నారని ఆరోపించారు. వన్నియార్ సామాజిక వర్గానికే చెందిన కొందరు న్యాయమూర్తులు పీఎంకే, ఏఎఫ్ఎస్‌జే‌లకు సంబంధించిన కేసుల విచారణ నుంచి తప్పుకోవడం చూసి తాను ఆశ్చర్యపోయినట్టు డాక్టర్ రాందాస్ చెప్పారు.