Pune: రెడీ... గెట్... సెట్... గో..: పూణె ఎయిర్ పోర్టు ట్వీట్

  • పూణె నుంచి బయలుదేరిన విమానాలు
  • వ్యాక్సిన్ అందగానే భద్రపరిచేందుకు రాష్ట్రాల ఏర్పాట్లు
  • అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ కు సర్వం సిద్ధం
Flights Started from Pune with Vaccine

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారైన పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ నుంచి తొలి విడత వ్యాక్సిన్ డోస్ లను తీసుకుని వెళుతున్న విమానాలు టేకాఫ్ అయ్యాయని పూణె ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు నేటి ఉదయం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఏఏఐ ఓ పోస్ట్ పెట్టింది.

"వేచి చూస్తున్న ఇండియా... రెడీ... గెట్... సెట్... గో...! ఈ మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ విమానాల్లోకి ఎక్కుతోంది. దేశమంతటికీ చేరబోతోంది" అని పేర్కొంది.

ఇందుకు సంబంధించిన ఓ చిన్న వీడియోను కూడా పూణె ఎయిర్ పోర్టు అధికారులు తమ ట్విట్టర్ ఖాతాకు జోడించారు. వ్యాక్సిన్ తీసుకుని వస్తున్న వాహనాలకు సంప్రదాయ పూజల తరువాత, సీరమ్ నుంచి ప్రత్యేక ట్రక్ లు ఎయిర్ పోర్టుకు చేరుకోగా, ఆ వెంటనే వ్యాక్సిన్ వయల్స్ ఉన్న బాక్స్ లను విమానాల్లోకి ఎక్కించారు.

"ఇవాళ ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థలు 9 విమానాల ద్వారా మొత్తం 56.5 లక్షల టీకా డోస్ లను 12 గమ్యస్థానాలకు చేర్చనున్నాయి" అని పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం 8 గంటల సమయంలో ఢిల్లీకి బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో వ్యాక్సిన్ బాక్స్ లు బయలుదేరాయి.

ఈ విమానం ఢిల్లీకి చేరుకోగానే, వాటిని సురక్షితంగా భద్రపరిచేందుకు ఢిల్లీ సర్కారు ఇప్పటికే ఏర్పాటు చేసింది. "నేడంతా వివిధ నగరాలకు వ్యాక్సిన్ ను చేర్చనున్నాం. ఇందుకు సంబంధించిన రవాణా ఏర్పాట్లను పకడ్బందీగా చేసేందుకు స్పైస్ జెట్ కట్టుబడివుంది. మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో మా వంతు సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రపంచ చరిత్రలోనే ఇది అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్. ఇది విజయవంతం కావాలి" అని స్పైస్ జెట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.

More Telugu News