రవిచంద్రన్ అశ్విన్ కు క్షమాపణలు చెప్పిన టిమ్ పైనీ!

12-01-2021 Tue 09:46
  • అశ్విన్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు స్లెడ్జింగ్
  • ఇప్పటికే మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా
  • పైనీపై తీవ్ర విమర్శలు
Tim paine Appolosies to Ravichandran Ashwin

ఆస్ట్రేలియా బౌలర్లకు కొరకరాని కొయ్యలుగా మారి, క్రీజులో పాతుకుపోయిన రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారిలు దాదాపు 50 ఓవర్ల పాటు వికెట్ పడకుండా జాగ్రత్తపడి, సిడ్నీలో జరిగిన మ్యాచ్ ని కాపాడి సిరీస్ ను 1-1తో సమంగా నిలిపిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అశ్విన్ ఏకాగ్రతను చెడగొట్టేందుకు ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్ పైనీ తనవంతుగా చాలా ప్రయత్నాలే చేశాడు. క్రీజులో ఉన్న అశ్విన్ ను నానా దుర్భాషలాడాడు.

టిమ్ పైనీ స్లెడ్జింగ్ మాటలు స్టంప్స్ మైక్ లో సైతం రికార్డు కాగా, ఆయన వైఖరిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా, తనపై వచ్చిన ఆరోపణలపై టిమ్ స్పందించాడు. "నేను కూడా ఓ మనిషినే. చేసిన తప్పునకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుకుంటున్నాను" అని ప్రకటించాడు. ఈ మేరకు వర్చ్యువల్ విధానంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న టిమ్ పైనీ, అశ్విన్ తనను మన్నించాలని కోరాడు.

"తమ జట్టు ఓటమి పాలు కాకుండా వారు చూపిన పోరాట పటిమను చూసి గర్వపడుతున్న వారిలో నేనూ ఒకడిని. నా జట్టును సరిగ్గా నడిపించలేక పోయాను. ఒత్తిడి పెరుగుతుంటే, సరైన వ్యూహాలు రచించలేదు. ఓ నాయకుడిగా నేనూ విఫలమయ్యాను. దీంతో నా టీమ్ విజయం సాధించలేకపోయింది" అని అన్నాడు.

కాగా, ఆన్ ఫీల్డ్ అంపైర్ పై నిరసన వ్యక్తం చేసినందుకు పైనీపై మ్యాచ్ రిఫరీ 15 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8 ప్రకారం టిమ్ తప్పు చేశాడని తేలినందునే జరిమానా విధించినట్టు స్పష్టం చేశారు.