COVID19: వ్యాక్సిన్ సరఫరా షురూ.. పూణె తయారీ కేంద్రం నుంచి బయటకొచ్చిన ట్రక్కులు

Trucks with covid vaccine out from Pune serum institute
  • సీరం టీకా తయారీ కేంద్రం నుంచి బయటకు వచ్చిన మూడు ట్రక్కులు
  • పూణె విమానాశ్రయానికి తరలింపు
  • అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు 
  • తొలి కార్గో విమానం హైదరాబాద్‌కే
కరోనా వైరస్‌తో భయపడిన భారతావనికి ఇక ఆ భయం అక్కర్లేదు. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీకాల సరఫరా ప్రారంభమైంది. పూణెలోని సీరం ఇనిస్టిట్యూట్ తయారీ కేంద్రం నుంచి తొలి విడత వ్యాక్సిన్లతో కూడిన ట్రక్కులు ఈ తెల్లవారుజామున బయటకు వచ్చాయి.

 పూర్తి భద్రత నడుమ బయలుదేరిన మూడు ట్రక్కులు పూణె విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి అవి దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకోనున్నాయి. మొత్తం 478 పెట్టెల్లో టీకాలను భద్రపరిచిన అధికారులు, వాటి రవాణా కోసం జీపీఎస్ సౌకర్యం ఉన్న ట్రక్కులను ఉపయోగించారు. కాగా, ఒక్కో పెట్టె బరువు 32 కిలోల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ డోసులు తొలి విడతలో ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్, హైదరాబాద్, విజయవాడ, గువాహటి, లక్నో, చండీగఢ్, భువనేశ్వర్ లకు  పంపించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక విమానాలను వినియోగించనున్నారు. ఇందులో రెండు కార్గో విమానాలు కాగా, 8 వాణిజ్య విమానాలు ఉన్నాయి. తొలి కార్గో విమానం హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్ వెళ్లనుండగా, రెండోది కోల్‌కతా, గువాహటి వెళుతుంది. సమీపంలోని ముంబైకి మాత్రం రోడ్డు మార్గం ద్వారానే టీకాలు చేరుకోనున్నాయి.
COVID19
Civid Vaccine
Pune
serum institute of india

More Telugu News