కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం... కేంద్రమంత్రి శ్రీపాద నాయక్ భార్య, పీఏ మృతి

12-01-2021 Tue 07:44
  • ఎల్లాపూర్ నుంచి గోకర్ణ వెళ్తుండగా ఘటన
  • నుజ్జునుజ్జయిన కారు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విజయ, దీపక్
  • ప్రాణాపాయం నుంచి బయటపడిన మంత్రి
  • గోవా సీఎంతో మాట్లాడిన ప్రధాని మోదీ
Union Minister Shripad Naik Injured In Accident and Wife PA Dead

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్ర రక్షణ, ఆయుష్ శాఖ సహాయమంత్రి  శ్రీపాద నాయక్  భార్య విజయ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి దీపక్ మృతి చెందారు. కర్ణాటకలోని ఎల్లాపూర్ నుంచి గోకర్ణ వెళ్తుండగా ఉత్తర కన్నడ జిల్లా అంకుల సమీపంలో  ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మంత్రి భార్య విజయ, పీఏ దీపక్‌లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంత్రి మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన బంబోలిమ్‌లోని గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  

ప్రమాదం ధాటికి మంత్రి ప్రయాణిస్తున్న టొయోటా కారు నుజ్జునుజ్జు అయిపోయింది. విషయం తెలిసిన ప్రధాని నరేంద్రమోదీ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో మాట్లాడి నాయక్ అత్యవసర చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. 68 ఏళ్ల నాయక్ ఉత్తర గోవా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాగా, మంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు.