ఫైజర్ టీకా రెండో డోసు తీసుకున్న అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్

12-01-2021 Tue 07:17
  • గత నెలలో తొలి డోసు తీసుకున్న బైడెన్
  • తాజాగా రెండో డోసు తీసుకున్న కాబోయే అధ్యక్షుడు
  • కొంత ఒత్తిడికి గురయ్యానన్న బైడెన్
joe biden taken pfizer vaccine second dose

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ ఫైజర్ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. గత నెల 21న తొలి డోసు తీసుకున్న బైడెన్ తాజాగా రెండో డోసు కూడా తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండో డోసు తీసుకుంటున్న సందర్భంలో కొంత ఒత్తిడికి గురైనట్టు చెప్పారు. దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందించడమే తన ప్రధాన కర్తవ్యమని బైడెన్ పేర్కొన్నారు.

తాను కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన బైడెన్.. వ్యాక్సిన్ చాలా సురక్షితమని ఆయన పేర్కొన్నారు. వైరస్‌ పీచమణచేందుకు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.

కరోనా టీకాపై ప్రజల్లో ఉన్న అనుమానాలను పోగొట్టేందుకు 78 ఏళ్ల బైడెన్ గత నెలలో బహిరంగంగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆమెరికా టీవీ చానళ్లు దీనిని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. తొలి డోసు వేయించుకున్న తర్వాత రెండో డోసు తప్పనిసరి కావడంతో తాజాగా అది కూడా తీసుకున్నారు.