పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల కన్నుమూత

11-01-2021 Mon 21:18
  • అనారోగ్యంతో బాధపడుతున్న దుగ్యాల
  • యశోదా ఆసుపత్రిలో చేరిక
  • చికిత్స పొందుతూ ఇవాళ మృతి
  • 2014 తర్వాత రాజకీయాలకు దూరమైన దుగ్యాల
Palakurthi ex mla Dugyala dies of ill ness

ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దుగ్యాల హైదరాబాదు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు రేపు హన్మకొండలో నిర్వహించనున్నారు. దుగ్యాల శ్రీనివాసరావుకు భార్య సుమన, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. దుగ్యాల మృతి పట్ల పలు పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

ఆయన స్వస్థలం వర్ధన్నపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి గ్రామం. 2004లో పాలకుర్తి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. తదనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే 2009 ఎన్నికల్లో దుగ్యాలకు ఓటమి ఎదురైంది. ఆయనపై ఎర్రబెల్లి దయాకర్ రావు 2,600 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లోనూ ఇదే ఫలితం వచ్చింది. ఆ తర్వాత దుగ్యాల శ్రీనివాసరావు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అనారోగ్య కారణాలే అందుకు కారణం.