రైతుల ఇంట సంక్రాంతి శోభ కనిపించాలంటే బకాయిలు వెంటనే విడుదల చేయాలి: నారా లోకేశ్

11-01-2021 Mon 20:03
  • రైతుల వెతలపై సీఎం జగన్ కు లోకేశ్ లేఖ
  • ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని వెల్లడి
  • ప్రభుత్వ ఉదాసీనతే అందుకు కారణమన్న లోకేశ్
  • ప్రకృతి విపత్తులతో రైతు కుదేలయ్యాడని వివరణ
Lokesh writes CM Jagan and demanded to pay dues to farmers

పండించిన పంటలు ఇంటికి చేరే తరుణం సంక్రాంతి అని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అన్నారు. అయితే ప్రభుత్వ ఉదాసీనత వల్ల ఈ సంక్రాంతికి ఏ ఒక్క రైతు ఇంట సంతోషాల కాంతి లేదు అని వ్యాఖ్యానించారు. రైతులను తక్షణమే ఆదుకోవాలని, వారి ఇంట సంతోషం నింపాలని డిమాండ్ చేస్తూ లోకేశ్ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. వేల రూపాయలు అప్పులు తెచ్చి పంటకు పెట్టుబడిగా పెట్టిన రైతన్నకు సకాలంలో ధాన్యం బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

2020 ఖరీఫ్ ఆరంభం నుంచి ఏపీలో రైతులు వరుసగా సంభవించిన ప్రకృతి విపత్తులతో 50 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారని, తద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోయారని లోకేశ్ వెల్లడించారు. సుమారు రూ.10 వేల కోట్ల పంట ఉత్పత్తులను కోల్పోయారని వివరించారు. అన్నదాతల ఇంట సంక్రాంతి శోభ కనిపించాలంటే రైతుల సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించి, వారికి చెల్లించాల్సిన బకాయిలను యుద్ధ ప్రాతిపదికన చెల్లించాలని తన లేఖలో స్పష్టం చేశారు.