నితీశ్ కుమార్ ఒక బ్లాక్ మెయిలర్, ఒక బార్గెయినర్: తేజస్వి యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు

11-01-2021 Mon 18:26
  • బీజేపీతో జేడీయూకి దూరం పెరుగుతోందనే ప్రచారం
  • ఎన్డీయేతోనే కలిసి ఉంటామన్న జేడీయూ
  • నితీశ్ కుమార్ పెద్ద మోసగాడు అన్న తేజస్వి 
Tejashwi Yadav calls Nitish Kumar as bargainer

బీజేపీ, జేడీయూ పార్టీల మధ్య లుకలుకలు మొదలయ్యాయనే ప్రచారం జరుగుతోంది. జేడీయూ పార్టీ అంతర్గత సమావేశాల సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శనివారం మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో సీట్ల షేరింగ్ లో ఆలస్యం జరగడం వల్ల జేడీయూ చాలా నష్టపోయిందని అన్నారు. బీజేపీ వెన్నుపోటు పొడిచిందని ఈ సమావేశం సందర్భంగా పలువురు జేడీయూ నేతలు దుయ్యబట్టారు.

ఈ నేపథ్యంలో బీజేపీతో జేడీయూకి దూరం పెరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో, నిన్న నితీశ్ మరోసారి మాట్లాడుతూ ఈ ప్రచారానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. ఈ సమస్యలను మరింత పెంచే ప్రయత్నం చేయాలనుకోవడం లేదని అన్నారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు అభివృద్దికి పాటుపడటమే తమ కర్తవ్యమని అన్నారు.

మరోవైపు జేడీయూ పార్లమెంటరీ పార్టీ నేత లలన్ సింగ్ పార్టీ సమావేశాల ముగింపు సందర్భంగా ఈరోజు మాట్లాడుతూ, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేతో కలిసే ఉంటామని చెప్పారు. ఎన్డీయేతో విభేదాలు ఎక్కువవుతున్నాయనే ప్రచారంలో నిజం లేదని అన్నారు. రెండు రోజుల పాటు జరిగిన పార్టీ సమావేశంలో తాము అన్ని అంశాలపై చర్చించామని తెలిపారు. బీహార్ లో తమకు సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ, ఓటింగ్ షేర్ మాత్రం అలాగే ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. ఎన్నికల సందర్భంగా నితీశ్ కుమార్ ఇచ్చిన 7 హామీలను అమలు చేసేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు.

ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ పై ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. బార్గెయిన్ (బేరమాడటం)లో నితీశ్ సిద్ధహస్తుడని ఎద్దేవా చేశారు. బీజేపీని మరోసారి బ్లాక్ మెయిల్ చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. నితీశ్ గత చరిత్రను పరిశీలిస్తే ఆయన మోసాలు బయటపడతాయని అన్నారు. జార్జ్ పెర్నాండెజ్ కావచ్చు, తమ ఆర్జేడీ పార్టీ కావచ్చు, మరెవరైనా కావచ్చు... నితీశ్ మోసం చేయనిది ఎవరిని? అని ప్రశ్నించారు. నితీశ్ ఎప్పుడూ అధికారదాహంతో ఉంటారని అన్నారు. ఆయనొక బ్లాక్ మెయిలర్, ఒక బార్గెయినర్, ఆయన వల్ల బీహార్ కు ఎంతో నష్టం జరిగిందని దుయ్యబట్టారు. నితీశ్ నాయకుడే కాదని తేజస్వి విమర్శించారు.