బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో సూత్రధారి అఖిలప్రియ: సీపీ అంజనీకుమార్

11-01-2021 Mon 17:38
  • అఖిలప్రియ ఇంటి నుంచే ప్లానింగ్ జరిగింది
  • కిడ్నాప్ కు భార్గవ్ రామ్ సహకరించారు
  • 6 సిమ్ కార్డులను కొనుగోలు చేశారు
Bhuma Akhilapriya is the key person in Kidnap case says CP Anjani Kumar

హైదరాబాద్ బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో భూమా అఖిలప్రియే సూత్రధారి అని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు అఖిలప్రియ, ఆమె పర్సనల్ అసిస్టెంట్ బోయ సంపత్ కుమార్, మల్లికార్జున్ రెడ్డి, డ్రైవర్ బాలా చెన్నయ్యను అరెస్ట్ చేశామని తెలిపారు. వీరి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, ఫేక్ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

మల్లికార్జున్ రెడ్డి ద్వారా అఖిలప్రియ 6 సిమ్ కార్డులను కొనుగోలు చేశారని తెలిపారు. మియాపూర్ లోని సెల్ ఫోన్ షాపులో ఈ సిమ్ కార్డులను కొనుగోలు చేశారని చెప్పారు. మల్లికార్జున్, శ్రీను పేర్ల మీద వీటిని ఈనెల 2న తీసుకున్నారని తెలిపారు. వీటిలో ఒక సిమ్ ను అఖిలప్రియ వాడగా, మరికొన్ని సిమ్ లను శ్రీను ఉపయోగించాడని చెప్పారు. 6 సిమ్ కార్డుల లొకేషన్లు, టవర్లను గుర్తించామని తెలిపారు.

కూకట్ పల్లిలోని లోధా అపార్ట్ మెంట్ లో అఖిలప్రియ నివాసం ఉన్నట్టు గుర్తించామని అంజనీకుమార్ చెప్పారు. కిడ్నాప్ కు రెక్కీ కూడా అఖిలప్రియ ఆధ్వర్యంలోనే జరిగిందని తెలిపారు. లోధా అపార్ట్ మెంట్ నుంచే దీనికి సంబంధించిన ప్లానింగ్ జరిగిందని చెప్పారు. కిడ్నాప్ కోసం ఒక స్కార్పియో, ఒక ఇన్నోవా, ఒక టూవీలర్ ను ఉపయోగించారని తెలిపారు. అఖిలప్రియ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ కు భార్గవ్ రామ్ కూడా సహకరించారని చెప్పారు. మరోవైపు, అఖిలప్రియ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఈరోజు కోర్టు కొట్టేసింది.