మీ పిల్లలకు మాత్రమే విదేశీ విద్యా? బడుగు, బలహీన వర్గాల పిల్లలు విదేశీ విద్యకు అర్హులు కారా?: నారా లోకేశ్

11-01-2021 Mon 15:33
  • ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపణ
  • విద్యార్థుల భవిష్యత్తు అంధకారం చేశారని వ్యాఖ్యలు
  • తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చారని విమర్శలు
  • జగన్ ది చెత్త పరిపాలన అంటూ ట్వీట్లు
Nara Lokesh questions CM Jagan over foreign education

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ధ్వజమెత్తారు. మీ పిల్లలకు మాత్రమే విదేశీ విద్యా? బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నత విద్య, విదేశీ విద్యకు అర్హులు కారా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేసి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చారని, విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా హిందూపురంకు చెందిన మక్బూల్ జాన్ అనే మహిళ తన కుమార్తెను విదేశాల్లో చదివించేందుకు పడుతున్న కష్టాల తాలూకు వీడియోను కూడా లోకేశ్ పంచుకున్నారు.

ఈ వీడియోపై లోకేశ్ స్పందిస్తూ, ఒక మైనారిటీ మహిళ తన కుమార్తెను విదేశాల్లో చదివించాలని కలగనడం తప్పా? అని నిలదీశారు. తన కుమార్తె విదేశీ విద్య కోసం ప్రభుత్వ సాయం అందించాలంటూ మక్బూల్ జాన్ కలవని నేత లేడు, పెట్టని అర్జీ లేదు అని వెల్లడించారు. ఎవరూ స్పందించకపోవడంతో ఆమె అనంతపురం జిల్లా హిందూపురం నుంచి అమరావతికి ఒంటరిగా నిరాహార యాత్ర చేశారని లోకేశ్ వెల్లడించారు. ప్రభుత్వం ఆమెకు సాయం అందించకపోగా, పోలీసులను పంపి ఆమె యాత్రను అడ్డుకుని అనేక ఇబ్బందుల పాల్జేశారని ఆరోపించారు. ఆమె ఆవేదన వింటే జగన్ రెడ్డిది ఎంత చెత్త పరిపాలనో కళ్లకు కట్టినట్టు అర్థమవుతుందని తెలిపారు.