Japan: వాయిదానా? పూర్తిగా రద్దా?.. టోక్యో ఒలింపిక్స్ పై సందిగ్ధత!

  • జపాన్ లో పెరుగుతున్న కొత్త కరోనా కేసులు
  • రద్దు చేయాలని అంటున్న 80 శాతం ప్రజలు
  • ఇంకా నిర్ణయం తీసుకోని జపాన్ ప్రభుత్వం
Cancell the Olympics says Japan People

జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ నిర్వహణపై సందిగ్ధత ఇంకా వీడలేదు. బ్రిటన్ లో వెలుగు చూసిన కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు జపాన్ లోనూ విస్తరిస్తుండటంతో టోక్యోలో సైతం ప్రస్తుతం కఠిన లాక్ డౌన్ నిబంధనలను అధికారులు అమలు చేస్తున్నారు.

ఇప్పటికే ఎమర్జెన్సీని ప్రభుత్వం విధించింది. ప్రయాణికులపై ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ ను వాయిదా వేయాలా? లేక పూర్తిగా రద్దు చేయాలా? అన్న విషయమై జపాన్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయమై ఉత్కంఠ నెలకొంది.

ఇదిలావుండగా, ఒలింపిక్స్ ను టోక్యోలో నిర్వహించాలా? వద్దా? అన్న విషయమై జపాన్ కు చెందిన ఓ మీడియా సంస్థ ఇటీవల సర్వే చేయగా, 80 శాతం మంది రద్దు చేయాలనే అభిప్రాయ పడటం గమనార్హం. ఇదే సమయంలో 35.3 శాతం మంది కొంతకాలం వాయిదా వేసి, పరిస్థితులు అనుకూలించిన తరువాత జరిపించవచ్చని సూచించారు.

వాస్తవానికి 2020 ఓలింపిక్స్ గత సంవత్సరం జూలైలోనే జరగాల్సి వుండగా, వాటిని 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8 మధ్య నిర్వహించేలా గతేడాది జపాన్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాకపోవడం, జపాన్ లో 2.90 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం, దాదాపు 4 వేల మందికి పైగా మరణించడంతో పోటీలు వద్దని అత్యధికులు కోరుకుంటున్నారు. ఇక వచ్చే సంవత్సరం ఈ పోటీలు జరుగుతాయా? లేక 2020 సీజన్ పూర్తిగా రద్దవుతుందా? అన్న విషయమై జపాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఓ నిర్ణయానికి రావాల్సి వుంది.

More Telugu News