Chandrababu: తుర్లపాటి కుటుంబరావు మృతికి వైఎస్ జగన్, చంద్రబాబు తదితరుల సంతాపం

  • పాత్రికేయుడిగా, గొప్ప వక్తగా ఆయ‌న‌ సేవలు శ్లాఘనీయం: చ‌ంద్ర‌బాబు
  • నిరాడంబ‌ర జీవ‌నం సాగించారు: లోకేశ్
  • పాత్రికేయ లోకానికి తీరని లోటు: విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి
  • ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాను: జీవీఎల్
chandrababu mourns demise of kutumbarao

ప్రముఖ పాత్రికేయుడు, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు (87) క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.

తుర్లపాటి కుటుంబరావు మృతి పట్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సంతాపం తెలుపుతూ ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

'సీనియర్ పాత్రికేయుడిగా, గొప్ప వక్తగా, రచయితగా తుర్లపాటి కుటుంబరావుగారి సేవలు శ్లాఘనీయం. పద్మశ్రీ, కళాప్రపూర్ణ తదితర అనేక పురస్కారాలే తుర్లపాటి ప్రతిభకు తార్కాణాలు. ఆయన మృతితో బహుముఖ ప్రజ్ఞావేత్తను రాష్ట్రం కోల్పోయింది. తుర్లపాటి కుటుంబరావుగారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేశారు.

'పాత్రికేయ దిగ్గ‌జం, ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత, విమ‌ర్శ‌కులు, వ‌క్త తుర్ల‌పాటి కుటుంబ‌రావు మృతి తెలుగు పాత్రికేయ‌, సాహితీ, క‌ళారంగాల‌కు తీర‌ని లోటు. ప‌ద్మ‌శ్రీతో పాటు లెక్క‌కు మించిన పుర‌స్కారాలు వ‌రించినా నిరాడంబ‌ర జీవ‌నం సాగించారు' అని లోకేశ్ చెప్పారు.

'త‌న తుదిశ్వాస వ‌ర‌కూ ర‌చ‌నా వ్యాసంగాన్ని కొన‌సాగించి పాత్రికేయ భీష్ముడిగా పేరొందారు. బ‌హుముఖ‌ప్ర‌జ్ఞాశాలి తుర్ల‌పాటి కుటుంబ‌రావు గారి కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ‌సంతాపం తెలియ‌జేస్తున్నాను' అని లోకేశ్ పేర్కొన్నారు.

పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు మరణం బాధాకరమని,  ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

'పద్మశ్రీ తుర్లపాటి మృతి పాత్రికేయ లోకానికి తీరని లోటు. ప్రముఖ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు గారు భావితరాల పాత్రికేయులకు ఆదర్శం. విలువలతో కూడిన పాత్రికేయుడిగా పనిచేశారు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందడం గర్వించదగ్గ పరిణామం. ఆయ‌న‌ మృతి పట్ల నా సంతాపం తెలుపుతున్నాను' అని బీజేపీ నేత విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి చెప్పారు.

'పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారి మరణం పత్రికా, సాహిత్య ప్రపంచానికి తీరని లోటు. విశిష్టమయిన రచనలతో, ప్రసంగాలతో తెలుగు ప్రజానీకానికి ఆయన అందించిన సేవలు అద్వితీయం. ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. అయన ఆప్తులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాను. ఓం శాంతి' అని బీజేపీ నేత‌ జీవీఎల్ న‌ర‌సింహారావు తెలిపారు.

More Telugu News