పంత్, పుజారా అవుట్ కావడంతో మారిన పరిస్థితి... ఓటమి తప్పాలంటే అద్భుతం జరగాల్సిందే!

11-01-2021 Mon 09:46
  • ప్రస్తుతం స్కోరు 280/5
  • విజయం సాధించాలంటే ఇంకా 127 పరుగులు
  • ఏదో ఒక జట్టు విజయం ఖాయమంటున్న విశ్లేషకులు
Situation Worsen for India after Pujara and Pant Out in Test Match

సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో నిమిషాల వ్యవధిలో ఇండియా జట్టు పరిస్థితి మారిపోయింది. ఈ ఉదయం రహానే అవుట్ అయిన తరువాత క్రీజ్ లోకి వచ్చిన రిషబ్ పంత్, కాసేపు నిలదొక్కుకునేందుకు ప్రయత్నించి, సఫలమైన తరువాత ఆసీస్ బౌలర్లపై వీర విజృంభణే చేశాడు. అవకాశం చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. అతనికి తోడుగా ఉన్న పుజారా ఆచితూచి ఆడాడు.

ఈ క్రమంలో 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ ను లియాన్ తన బౌలింగ్ లో అవుట్ చేయగా, ఆపై కాసేపటికే పుజారా 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవీలియన్ కు చేరడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో మునిగింది. ప్రస్తుతం హనుమ విహారి 4 పరుగులతో, రవిచంద్రన్ అశ్విన్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్ లో భారత టార్గెట్ 407 పరుగులు కాగా, ప్రస్తుతం స్కోరు 5 వికెట్ల నష్టానికి 280 పరుగులు.

నేడు మ్యాచ్ ముగిసేందుకు మరో 36 ఓవర్లు మిగిలున్నాయి. విజయం సాధించాలంటే, ఇంకా ఇండియాకు 127 పరుగులు అవసరం కాగా, ఆస్ట్రేలియాకు ఐదు వికెట్లు కావాలి. ప్రస్తుతం క్రీజులో ఉన్న హనుమ విహారి, అశ్విన్ లు సాధ్యమైనంత మేరకు మ్యాచ్ ని ముందుకు తీసుకుని వెళ్లాల్సి వుంది. ఇక భారత రెండో ఇన్నింగ్స్ లో జోష్ హాజల్ వుడ్, నాథన్ లియాన్ లకు చెరో రెండు, పాట్ కుమిన్స్ కు ఒక వికెట్ లభించాయి. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఏదో ఒక జట్టు విజయం సాధిస్తుందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.