బోయినపల్లి కిడ్నాప్ కేసు.. భార్గవ్‌రామ్ తండ్రి అరెస్ట్‌కు రంగం సిద్ధం

11-01-2021 Mon 08:08
  • పరారీలో భార్గవ్‌రామ్
  • శ్రీరామ్ నాయుడు ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • తాను శనివారమే దుబాయ్ నుంచి వచ్చానన్న శ్రీరామ్ నాయుడు
  • భార్గవ్ రామ్ కోసం మహారాష్ట్రలో గాలిస్తున్న పోలీసు బృందం
Police Ready to Arrest Bhargav Ram Father in Bowenpally Kidnap Case

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసిన పోలీసులు, ఆమె భర్త భార్గవ్‌రామ్, ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో భార్గవ్‌రామ్ తండ్రి శ్రీరామ్ నాయుడు అరెస్ట్‌కు పోలీసులు రెడీ అవుతున్నారు. ఆయనను అరెస్ట్ చేసి విచారిస్తే భార్గవ్‌రామ్ ఆచూకీ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇందులో భాగంగా గత రాత్రి యూసుఫ్‌గూడలోని శ్రీరామ్‌ నాయుడు ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు భారీగా మోహరించారు. అయితే, ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల కిడ్నాప్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను శనివారమే దుబాయ్ నుంచి వచ్చినట్టు ఆయన పోలీసులకు తెలిపారు.

మరోవైపు, పరారీలో ఉన్న భార్గవ్‌రామ్ మహారాష్ట్రలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ బృందం అక్కడ గాలిస్తుండగా, మరో బృందం కర్నూలు, గుంటూరులో గాలిస్తోంది. బాధితులు ఇచ్చిన వివరాల ఆధారంగా కిడ్నాపర్ల ఊహా చిత్రాలను పోలీసులు సిద్దం చేస్తున్నారు.