అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడంటూ ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ కు జరిమానా

10-01-2021 Sun 21:29
  • సిడ్నీ టెస్టులో ఘటన
  • పుజారా అవుట్ కోసం డీఆర్ఎస్ కోరిన పైన్
  • డీఆర్ఎస్ లో ఆస్ట్రేలియాకు వ్యతిరేక ఫలితం
  • అసహనం ప్రదర్శించిన పైన్
 Australian skipper Tim Paine fined in Sydney test

సిడ్నీ టెస్టులో అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడంటూ ఆస్ట్రేలియా సారథి టిమ్ పైన్ కు మ్యాచ్ రిఫరీ జరినామా విధించారు. ఓ అంతర్జాతీయ మ్యాచ్ లో అంపైర్ నిర్ణయం పట్ల బహిరంగంగా వ్యతిరేకత చూపాడని, అందుకే టిమ్ పైన్ కు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్టు ఐసీసీ ప్రకటన చేసింది. ఐసీసీ నియమావళిలోని 2.8 అధికరణ ప్రకారం టిమ్ పైన్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడని ఐసీసీ ధ్రువీకరించింది. అంతేకాదు, పైన్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ ను కూడా చేర్చింది.

సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా, పుజారా అవుట్ కోసం డీఆర్ఎస్ కోరారు. డీఆర్ఎస్ ఫలితం ఆసీస్ కు వ్యతిరేకంగా రావడంతో పైన్ అంపైర్ పట్ల తన అసహనాన్ని ప్రదర్శించాడు. పైన్ తన తప్పిదాన్ని అంగీకరించడంతో జరిమానాతో సరిపెట్టారు.