టీడీపీతో కలిసి ఉన్నప్పుడు పవన్ ఎందుకు దివీస్ ను వ్యతిరేకించలేదు?: సూటిగా ప్రశ్నించిన మంత్రి మేకపాటి

10-01-2021 Sun 20:52
  • నిన్న తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన
  • దివీస్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు
  • అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి మేకపాటి
  • పవన్ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నాడని ఆరోపణ
  • యువతను రెచ్చగొట్టవద్దని హితవు
Mekapati slams Pawan Kalyan over Divis industry in East Godavari

తూర్పు గోదావరి జిల్లాలో దివీస్ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న వారికి జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటూ యువతను రెచ్చగొట్టవద్దని పవన్ కు హితవు పలికారు.

అయినా, దివీస్ పరిశ్రమ మొదలైంది టీడీపీ హయాంలోనే అని, నాడు టీడీపీతో కలిసి ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ దివీస్ ను ఎందుకు వ్యతిరేకించలేదని నిలదీశారు. 2018లో దివీస్ ప్రారంభమైందని, ఇప్పుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతుండడం కేవలం రాజకీయ లబ్దికోసమే అని మేకపాటి ఆరోపించారు.

రాష్ట్రంలో పరిశ్రమలపై పవన్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన రైతులకు, చుట్టుపక్కల గ్రామాల వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయని మంత్రి స్పష్టం చేశారు.