Nimmagadda Ramesh Kumar: పోలింగ్ సిబ్బంది కరోనా బారినపడకుండా అన్ని చర్యలు తీసుకుంటాం: నిమ్మగడ్డ రమేశ్ కుమార్

  • స్థానిక ఎన్నికలకు ఏపీలో షెడ్యూల్ విడుదల
  • ఎన్నికలపై ఏపీ ఎన్జీవోల వ్యతిరేకత
  • కరోనా నేపథ్యంలో పాల్గొనలేమని వెల్లడి
  • ఉద్యోగులకు భరోసా ఇచ్చేందుకు నిమ్మగడ్డ ప్రయత్నం
Nimmagadda Ramesh Kumar gives assurance to employs

కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై ఉద్యోగ సంఘాలు విముఖత వ్యక్తం చేస్తుండడంపై ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పందించారు. పోలింగ్ సిబ్బంది కరోనా బారినపడకుండా అన్ని రకాల భద్రత చర్యలు తీసుకుంటామని హామీ చేశారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో పోలింగ్ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు వెల్లడించారు. పోలింగ్ సిబ్బందికి పీపీఈ సూట్లు, ముఖ కవచాలు అందిస్తామని వివరించారు.

ఏపీ ఉద్యోగులు ఎవరికీ తీసిపోరని, ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఎంతో కష్టించి పనిచేసిన ఘనత ఏపీ ఉద్యోగుల సొంతం అని నిమ్మగడ్డ కొనియాడారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనూ వారు అదే స్ఫూర్తిని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల నిర్వహణపై రాష్ట్రంలోని పార్టీలు తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని, స్థానిక ఎన్నికలు జరపాలనే ఆ పార్టీలు కోరుతున్నాయని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే కేంద్రం నుంచి ఆర్ధిక సంఘం నిధులు అందుతాయని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా స్థానిక ఎన్నికలు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో అందరూ కలిసిరావాలని సూచించారు.

More Telugu News