సిడ్నీ మైదానంలో ప్రేక్షకులు సిరాజ్ ను ఏమని దూషించారంటే..!

10-01-2021 Sun 19:37
  • సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ప్రేక్షకుల దురహంకారం
  • భారత ఆటగాళ్లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు
  • సిరాజ్ ను దూషించిన ఆస్ట్రేలియా ప్రేక్షకులు
  • అంపైర్లకు ఫిర్యాదు చేసిన సిరాజ్
  • ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
This is what Sydney audience abused Indian fast bowler Mohammed Siraj

సిడ్నీ మైదానంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ను కొందరు ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలతో దూషించడం తెలిసిందే. నిన్నటి ఆటలో సిరాజ్ ను జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేసిన ప్రేక్షకులు, ఇవాళ కూడా తమ దురహంకారాన్ని చాటుకున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

కాగా, ప్రేక్షకులు సిరాజ్ పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఓ కథనంలో వెల్లడైంది. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని ఉన్న కొందరు వ్యక్తులు సిరాజ్ ను ఉద్దేశించి 'బ్రౌన్ డాగ్', 'బిగ్ మంకీ' అని పిలిచినట్టు గుర్తించారు. ఈ రెండు పదాలను జాత్యహంకార వ్యాఖ్యలుగా పరిగణిస్తారు. సిరాజ్ నే కాకుండా బుమ్రాను కూడా అదేపనిగా దూషించారని బీసీసీఐకి చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు.

కాగా, తన పట్ల వ్యాఖ్యలు రావడంతో సిరాజ్ వెంటనే మైదానంలోని అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. దాంతో న్యూ సౌత్ వేల్స్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ప్రేక్షకుల్లో ఉన్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.