ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన ఎస్బీఐ

10-01-2021 Sun 16:12
  • ఖాతాదారులకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ
  • వివిధ కాల పరిమితుల ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ పెంపు
  • ఈ నెల 8 నుంచి అమలు
  • ఖాతాదారులకు లబ్ది చేకూరనున్న వైనం
SBI hikes interest rates on fixed deposits rates

తన ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శుభవార్త చెప్పింది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. వివిధ కాలపరిమితులతో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసిన ఖాతాదారులు వడ్డీ పెంపుతో లాభం పొందనున్నారు. పెంచిన వడ్డీ రేట్లు ఈ నెల 8 నుంచి అమలు చేస్తున్నట్టు బ్యాంకు వెల్లడించింది. ఇప్పటికే ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసినవారికి, కొత్తగా చేయబోయే వారికి ఈ పెంపుతో లబ్ది చేకూరనుంది.

గతేడాది సెప్టెంబరులో వడ్డీ రేట్లను సవరించిన తర్వాత మళ్లీ సవరణ చేయడం ఇదే ప్రథమం. అటు, సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ 50 బేసిస్ పాయింట్ల వరకు అదనంగా అందజేస్తోంది. తద్వారా వారికి 0.5 శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది. ఇక సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ వీ కేర్ డిపాజిట్ స్కీమ్ ద్వారా 30 బేసిస్ పాయింట్లు లభిస్తాయి.

ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి...

7 రోజుల నుంచి 45 రోజులు-2.9%
46 రోజుల నుంచి 179 రోజులు-3.9%
180 రోజుల నుంచి 210 రోజులు-4.4%
211 రోజుల నుంచి ఒక ఏడాది లోపు-4.4%
1 ఏడాది నుంచి 2 సంవత్సరాలు-5%
2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు-5.1%
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు-5.3%
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు-5.4%