మాకు ఎన్నికల కంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యం: ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి

10-01-2021 Sun 15:41
  • ఏపీలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన
  • అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీఎన్జీవో సంఘం
  •  షెడ్యూల్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టీకరణ
  • కోర్టులకైనా వెళతామని వెల్లడి
AP NGO threatens to boycott local body elections in state

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంపై ఏపీఎన్జీవో సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగులు ఎన్నికల్లో పాల్గొనడం సాధ్యం కాదని, ఎన్నికల షెడ్యూల్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాకాకుండా ఏపీ ఎన్నికల సంఘం మొండిగా ముందుకు వెళితే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.

ఊహించని విధంగా ఎస్ఈసీ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఉద్యోగులు విస్మయానికి గురయ్యారని వెల్లడించారు. ఎన్నికల వాయిదా కోసం న్యాయస్థానాలకైనా వెళతామని, తాము ఏ పార్టీకి కొమ్ముకాయడంలేదని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తమకు ఎన్నికల కంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యమని ఉద్ఘాటించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.