హైదరాబాద్ లో సూట్ కేసులో మృత‌దేహం.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

10-01-2021 Sun 10:30
  • రాజేంద్రనగర్‌లో ఘ‌ట‌న‌
  • ఇద్ద‌రు జేబు దొంగ‌ల ఘాతుకం
  • తోటి దొంగ‌ను చంపిన కేటుగాళ్లు
dead body in suitcase

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లో ఓ వ్య‌క్తిని హ‌త్య చేసి మృత‌దేహాన్ని సూట్ కేసులో పెట్టారు ఇద్ద‌రు దొంగ‌లు. తాజాగా ఇద్దరు జేబు దొంగలను ప‌ట్టుకున్న పోలీసులు వారు చేసిన నేరాల గురించి ద‌ర్యాప్తు జ‌రుపుతుండ‌గా వారికి ఈ విష‌యం తెలిసింది. త‌మతో పాటు చోరీల‌కు పాల్ప‌డే రషీద్ అనే వ్య‌క్తితో గొడ‌వ ప‌డి తాము అత‌డిని హత్య చేసి సూట్‌కేసులో పెట్టామ‌ని వారిద్ద‌రు చెప్పారు.

ఆ సూట్ కేసును ఎక్క‌డ ప‌డేశామ‌న్న విష‌యాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. సూట్ కేసులోని మృత‌దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతుడు రషీద్‌ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన వ్య‌క్త‌ని పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై త‌దుప‌రి విచార‌ణ జ‌రుపుతున్నారు.