ఢిల్లీలో రైతుల ఆందోళన.. విషం తాగి రైతు మృతి

10-01-2021 Sun 08:18
  • విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన అమరీందర్
  • ఇప్పటి వరకు 57 మంది రైతుల మృతి
  • మోదీ ప్రభుత్వం తీరుపై ప్రియాంక గాంధీ మండిపాటు
Another Farmer Suicide In Delhi Boarder

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో పంజాబ్, హర్యానా రైతులు చేస్తున్న ఉద్యమం కొనసాగుతోంది. ప్రభుత్వంతో ఇప్పటి వరకు పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని విరమించబోమని రైతు సంఘాలు చెబుతుండగా, సవరణలకు తప్ప చట్టాలను ఉపసంహరించుకునేందుకు అంగీకరించే ప్రసక్తే లేదని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది.

ఎముకలు కొరికే చలిలో నెలన్నర రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు రైతులు మరణించారు. తాజాగా, సింధు సరిహద్దు వద్ద మరో రైతు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆందోళనల్లో పాల్గొంటున్న పంజాబ్‌కు చెందిన 40 ఏళ్ల అమరీందర్ సింగ్ విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన సహచర రైతులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అమరీందర్ మృతి చెందాడు.

రైతు ఆత్మహత్యపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. రైతు సమస్యలను మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మృతి బాధాకరమన్నారు. కాగా, ఆందోళన చేస్తున్న రైతుల్లో ఇప్పటి వరకు 57 మంది మరణించారు. పదుల సంఖ్యలో రైతులు అనారోగ్యం పాలయ్యారు.