ఇది చైనా అనుకుంటున్నారా? ట్విట్టర్ పై ధ్వజమెత్తిన నిక్కీ హేలీ!

10-01-2021 Sun 07:17
  • ట్రంప్ ఖాతాను నిలిపివేసిన ట్విట్టర్
  • నమ్మశక్యంగా లేదన్న నిక్కీ హేలీ
  • అమెరికా ప్రజాస్వామ్య దేశమన్న బెన్ కార్సన్
Nikki Haley Fires on Twitter

యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను నిలిపివేయడంపై నిక్కీ హేలీ మండిపడ్డారు. అమెరికా ఏమీ చైనా వంటి దేశం కాదని, ప్రజలను నోరెత్తకుండా చేయడం చైనాలోనే జరుగుతుందని, తమ దేశంలో కాదని, ట్రంప్ ఖాతాను బ్లాక్ చేయడం నమ్మశక్యంగా లేదని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆమె ఓ ట్వీట్ పెట్టారు.

కాగా, గత వారం వాషింగ్టన్ డీసీ లోని క్యాపిటల్ భవంతిపై ట్రంప్ అనుచరులు చేసిన దాడి, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఆ ఘటన తరువాత ట్రంప్ చేసిన పలు ట్వీట్లు హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని ఆరోపిస్తూ, ఆయన ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా మూసి వేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకు కొన్ని గంటల ముందు ఫేస్ బుక్ ఆయన ఖాతాను నిరవధికంగా తొలగిస్తున్నట్టు పేర్కొంది.

ఈ ఘటన జరిగిన తరువాత ట్రంప్ కు అనుకూలంగా ట్వీట్లు వస్తున్నాయి. ఓ ప్రజాస్వామ్య దేశంలో ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ ఉంటుందని, దాన్ని అణచివేసే ప్రయత్నాలు తగవని పలువురు ప్రముఖులు ట్రంప్ కు అండగా నిలుస్తున్నారు. నిక్కీ హేలీతో పాటు యూఎస్ పట్టణాభివృద్ధి, హౌసింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ బెన్ కార్సన్ సైతం ట్రంప్ కు మద్దతుగా నిలిచారు.

తమను ఏకం చేసేలా కొంతమంది నోళ్లను మూయించాలని చూస్తున్నారని ఆరోపించిన ఆయన, చరిత్రను చెరిపివేయడం సరైన మార్గం కాదన్నారు. ఇది యూఎస్ లో ప్రజల మధ్య మరింత విభజనకు దారితీస్తుందని అభిప్రాయపడ్డ ఆయన, సామాజిక మాధ్యమ దిగ్గజాలు మీడియా సంస్థలేమీ కాదని, అయినా, అవి మీడియా సంస్థల్లా పని చేయాలని భావిస్తున్నాయని అన్నారు. జరిగిన పరిణామాలకు బాధ్యత వహించేందుకు అవి ఇష్టపడటం లేదని మండిపడ్డారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా, వాక్ స్వాతంత్ర్యం ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఉండాల్సిందేనని అన్నారు.