అమెరికానే మాకు ప్రబల శత్రువు: బైడెన్ కు సవాల్ విసిరిన కిమ్

09-01-2021 Sat 21:44
  • మరికొన్నిరోజుల్లో బైడెన్ ప్రమాణస్వీకారం
  • నేరుగా అమెరికానే టార్గెట్ చేసిన కిమ్
  • అధికారంలో ఎవరున్నా అమెరికా బుద్ధి మారదని వెల్లడి
  • అమెరికా తమ ప్రగతి నిరోధకం అని ఆరోపణ
Kim says US is biggest enemy to North Korea

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ ఇంకా బాధ్యతలు కూడా స్వీకరించకముందే ఆసియా దేశం ఉత్తర కొరియా నుంచి సవాల్ ఎదురైంది. అమెరికానే తమకు అతిపెద్ద శత్రువు అని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. మరింత శక్తిమంతమైన అణ్వస్త్రాలు రూపొందించాలంటూ కిమ్ తన దేశ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. ఎవరు అధికారంలోకి వచ్చినా వైట్ హౌస్ శత్రు విధానాల్లో మార్పు ఉండదని, ఒకవేళ ఆ విధానాలను విడనాడితే మాత్రం ఉత్తర కొరియా-అమెరికా సంబంధాల బలోపేతానికి కీలకం కాగలదని కిమ్ అభిప్రాయపడినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ కేసీఎన్ఏ వివరించింది.

"ఉత్తర కొరియా ఆవిష్కరణల రంగానికి అమెరికానే ప్రగతి నిరోధకం. ఇకపై మన విదేశాంగ రాజకీయ కార్యకలాపాలన్నీ అమెరికాను కట్టడి చేయడంపైనే కేంద్రీకరించాలి. అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నారన్నది ముఖ్యం కాదు. ఉత్తర కొరియాపై వాళ్ల ప్రాథమిక అభిప్రాయాల్లో మాత్రం మార్పు ఉండదు. అయితే, ఉత్తర కొరియా తన అణు ఆయుధాలను దుర్వినియోగం చేయదు. అణు పాటవాన్ని విస్తరిస్తుంది. దురాక్రమణదారులకు, దీటుగా బదులివ్వాల్సిన పరిస్థితులకు అనుగుణంగా సామర్థ్యాలు పెంచుకుంటున్నాం. వార్ హెడ్ల సైజును కూడా భిన్న పరిమాణాల్లో రూపొందిస్తున్నాం" అని కిమ్ స్పష్టం చేసినట్టు కేసీఎన్ఏ తెలిపింది.