Chandrababu: గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేసి తాజా నోటిఫికేషన్ ఇవ్వాలి: చంద్రబాబు

Chandrababu responds to election schedule for Gram Panchayats
  • స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎస్ఈసీ
  • అన్ని స్థానాలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న చంద్రబాబు
  • ఆన్ లైన్ లోనూ నామినేషన్లు స్వీకరించాలని విజ్ఞప్తి
  • కోడ్ రాకతో సీఎం ఇంటికే పరిమితం అని వెల్లడి
  • అధికారులు నిష్పాక్షికంగా పనిచేయాలని సూచన
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరపాలని సూచించారు. గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని స్థానాలకు మళ్లీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని అన్నారు. గతంలో జరిగిన అనేక సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ లోనూ నామినేషన్లు స్వీకరించాలని, కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్థానిక ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో గ్రామ వలంటీర్లకు భాగస్వామ్యం కల్పించవద్దని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన వైసీపీ సర్కారుపైనా వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు, సీఎంకు సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎన్నికల సంఘాన్ని నియంత్రించేందుకు సీఎం ఎవరు? ఎన్నికలకు వ్యతిరేకంగా తనవాళ్లతో ప్రకటనలు ఇప్పించడం ఏమిటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ చెప్పుచేతల్లో ఉండే అధికారులకే ఉన్నత పదవులా అని నిలదీశారు.

మీ కేసులో నిందితులను రాష్ట్రాలు దాటించి ఉన్నత పదవులు ఇస్తారా? శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్ నుంచి తెచ్చుకుని పోస్టింగ్ ఇస్తారా? మీ కేసుల్లో ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ను సీఎస్ చేస్తారా? ఆ అధికారులతో మీకు, మీ పార్టీకి అనుకూలంగా పనిచేయిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అధికారులు, పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. కోడ్ వల్ల ఎన్నికలు పూర్తయ్యే వరకు సీఎం ఇంటికే పరిమితం అని, వైసీపీ నాయకులకు ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు.
Chandrababu
Local Body Polls
Gram Panchayat Elections
Schedule
YSRCP
Jagan
Andhra Pradesh

More Telugu News