భూ వివాదాల సెటిల్మెంట్లు, కేసుల్లో టీఆర్ఎస్ నేతల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి: విజయశాంతి

09-01-2021 Sat 19:12
  • రాష్ట్రంలో ప్రతి అంగుళం కబ్జానే అంటూ వ్యాఖ్యలు
  • దేన్నీ వదలడంలేదంటున్న విజయశాంతి
  • సర్కారు ప్రోత్సాహంతోనే కబ్జాలని వెల్లడి
  • ధరణి పోర్టల్ దెబ్బకు అంతా అల్లాడుతున్నారని విమర్శలు
BJP leader Vijayasanthi comments on TRS leaders

కాంగ్రెస్ ను వీడి ఇటీవలే బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి మరోసారి అధికార టీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. తెలంగాణలోని తాజా పరిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రతి అంగుళం కబ్జాకోరుల క్రీనీడలోనే ఉన్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఖాళీ స్థలాలు, పార్కులు, ఎక్కడ చూసినా కాదేదీ ఆక్రమణకు అనర్హం అన్నట్టుగా పరిస్థితి తయారైందని విమర్శించారు. ఇలాంటి భూవివాదాల సెటిల్మెంట్లు, కేసుల్లో ఎక్కువగా టీఆర్ఎస్ నేతల పేర్లే వినిపిస్తున్నాయని విజయశాంతి ఆరోపించారు.

ఆక్రమణలను అడ్డుకోవడం సంగతి అటుంచితే, ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్న తెలంగాణ పాలకుల తీరు వల్లే కబ్జాకోరులు రెచ్చిపోతున్నారని విమర్శించారు. రాష్ట్రమంతటా భూవివాదాలేనని, అటు న్యాయస్థానాల్లోనూ భూవివాదాలకు సంబంధించిన కేసులు వేలకు వేలుగా పెరిగిపోతున్నాయని వివరించారు.

ఇవి చాలవన్నట్టుగా, భూ సమస్యలకు సర్వరోగ నివారిణి అంటూ కేసీఆర్ ధరణి పోర్టల్ గురించి ఊదరగొడుతున్నారని, కానీ ధరణి పోర్టల్ దెబ్బకు సామాన్యులతో పాటు రియల్టర్లు కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. 'కోర్టులు చీవాట్లు పెడుతున్నా మారని మీ తీరుతో మీ అధికారం కబ్జా అయ్యే పరిస్థితి దగ్గర పడుతోందని మర్చిపోకండి' అంటూ విజయశాంతి హెచ్చరించారు.