ఇలాంటి వార్తలు ఎక్కడ నుంచి పుట్టిస్తారో?: రేణు దేశాయ్‌

09-01-2021 Sat 17:22
  • మహేశ్ బాబుకు వదినగా రేణు నటిస్తున్నారని ప్రచారం
  • ఈ వార్తలో నిజం లేదన్న రేణు దేశాయ్
  • ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రచారమే చేశారని వ్యాఖ్య
Redu Desai condemns news of acting in Mahesh Babus film

ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ తెలుగులో తన ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఇప్పటికే ఓ చిత్రాన్ని ఆమె పూర్తి చేశారు. అంతేకాదు మరో రెండు సినిమాల కథలు విన్నానని, వాటిని ఫైనలైజ్ చేయాల్సి ఉందని ఆమె స్వయంగా చెప్పారు. దీనికి తోడు రైతుల సమస్యలపై ఓ సినిమాను నిర్మించేందుకు ఆమె అన్నీ సిద్ధం చేసుకున్నారు.

మరోవైపు ఆమె గురించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. మహేశ్ బాబు తాజా చిత్రం 'సర్కారువారి పాట' చిత్రంలో రేణు నటించబోతున్నారనేదే ఆ వార్త. మహేశ్ కి వదినగా ఆమె నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఆమె స్పందించారు.

ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని రేణు దేశాయ్ చెప్పారు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టిస్తారో అర్థం కావడం లేదని అన్నారు. అంతకు ముందు 'మేజర్' సినిమాలో నటించబోతున్నానని ప్రచారం చేశారని... ఇప్పడు ఈ ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒకవేళ తాను నటిస్తే ఆ  విషయాన్ని తానే ప్రకటిస్తానని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా వివరాలను వెల్లడిస్తానని తెలిపారు.