కలిసి పని చేద్దాం.. హుందా రాజకీయాలు చేద్దాం: కేటీఆర్

09-01-2021 Sat 15:00
  • రాష్ట్రం కోసం కలిసి పని చేద్దాం
  • ఎన్నికల ముందు ఎవరేం చేశామో గొప్పగా చెప్పుకుందాం
  • బీజేపీకి హితవు పలికిన కేటీఆర్
KTR suggests BJP to work together after elections

ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ కు, బీజేపీకి మధ్య వైరం మరింత ముదిరింది. ఇరు పార్టీల నేతల మధ్య కురుస్తున్న విమర్శల జడివానతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయపరంగా పోటీ పడదామని బీజేపీకి సూచించారు. మిగిలిన సమయంలో అభివృద్ధి కోసం పోటీ పడదామని, రాష్ట్ర అభ్యున్నతి కోసం కలిసి పని చేద్దామని చెప్పారు. ఎన్నికల ముందు ఎవరు చేసిన పనిని వారు గొప్పగా చెప్పుకుందామని అన్నారు. హుందాగా రాజకీయాలు చేద్దామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో పలు అభివృద్ది పనులకు ఈరోజు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ముషీరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించే సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

లంబాడి తండాలో ఆడబిడ్డలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. విలువైన ఇళ్లను ప్రజకు ఇస్తున్నామని, ఒక్కో ఇంటి విలువ రూ. 40-50 లక్షలు ఉంటుందని చెప్పారు. 28 రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఇళ్లను ఇవ్వడం లేదని అన్నారు. ఇళ్లను కిరాయికి ఇవ్వడం, అమ్మడం వంటి పనులు చేయవద్దని... ఒకవేళ అలా చేస్తే ఇచ్చిన ఇంటిని వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పారు.