ఎన్నికల విధులు బహిష్కరిస్తాం.. నిమ్మగడ్డ వ్యక్తిగత ప్రతిష్టకు పోకూడదు: ఏపీ ఉద్యోగ సంఘాలు

09-01-2021 Sat 13:15
  • రాష్ట్రంలో కొత్త స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ ప్రబలుతున్నాయి
  • ఎన్నికల నోటిఫికేషన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలి
  • ఎస్ఈసీ మొండిగా నోటిఫికేషన్ విడుదల చేశారు
AP Empoyee Unions demands to withdraw localbody polls notification

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కరోనా టీకా వేయాల్సిన సమయంలో ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం చెప్పినప్పటికీ... ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఉద్యోగుల సంఘాలు తప్పుపట్టాయి.

ఎన్నికల నోటిఫికేషన్ ను ఈసీ వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఎన్టీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ వంటివి ప్రబలుతున్నాయని.. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను నిలుపుదల చేయాలని అన్నారు. లేనిపక్షంలో తాము ఎన్నికల విధులను బహిష్కరిస్తామని చెప్పారు. న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ జరుగుతున్న సమయంలో నోటిఫికేషన్ విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో కరోనా వ్యాపించిందని అన్నారు. ఎస్ఈసీ మొండిగా నోటిఫికేషన్ ను విడుదల చేశారని చెప్పారు. రాష్ట్రంలో పాలన కుంటుపడలేదని... 9 లక్షలకు పైగా ఉద్యోగులు విధుల్లో ఉన్నారని తెలిపారు.

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొనబోరని ఉపాధ్యాయ సంఘాల నేత సుధీర్ బాబు అన్నారు. ప్రభుత్వ అభ్యర్థనను ఎస్ఈసీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ ప్రశ్నించారు. వ్యక్తుల కోసం కాకుండా, వ్యవస్థ కోసం ఎన్నికల సంఘం పని చేయాలని హితవు పలికారు.

రాష్ట్రంలో కరోనా ఎలా నియంత్రణలోకి వచ్చిందనే విషయాన్ని ఎన్నికల సంఘం తెలుసుకోవాలని... ఉద్యోగులు పని చేసినందు వల్లే కరోనా కంట్రోల్ అయిందని చెప్పారు. ఎస్ఈసీ వ్యక్తిగత ప్రతిష్టకు పోవద్దని విన్నవించారు. వ్యాక్సినేషన్ పూర్తయ్యాక లేదా కనీసం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ వేశాక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.