మ‌హారాష్ట్ర‌లోని ఆసుప‌త్రిలో 10 మంది శిశువుల మృతిపై.. మోదీ, షా , రాహుల్ దిగ్భ్రాంతి

09-01-2021 Sat 10:06
  • మహారాష్ట్రలోని భండారా జిల్లా ఆసుప‌త్రిలో  అగ్నిప్రమాదం
  • త‌న‌ను క‌ల‌చి వేసింద‌న్న‌ మోదీ
  • చిన్నారుల కుటుంబాలకు ప్ర‌గాఢ సానుభూతి
  • గాయాల‌పాలైన వారు త్వ‌ర‌గా కోలుకుంటార‌ని ట్వీట్
 Modi expresses grief over the fire incident at Bhandara District General Hospital

మహారాష్ట్రలోని భండారా జిల్లా ఆసుప‌‌త్రిలో  అగ్నిప్రమాదం చోటుచేసుకుని 10 మంది శిశువులు మృత్యువాత పడ్డ విష‌యం తెలిసిందే. దీనిపై ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ హృదయవిదారక ఘటన త‌న‌ను క‌ల‌చి వేసింద‌ని మోదీ ట్వీట్లు చేశారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌లో గాయాల‌పాలైన వారు త్వ‌ర‌గా కోలుకుంటార‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ ఘ‌ట‌న త‌న‌ను క‌లచివేసింద‌ని అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ అగ్నిప్ర‌మాదంలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని చెప్పారు. ప్రాణాలు కోల్పోయిన శిశువుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉండాల‌ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు. కాగా, మృతి చెందిన‌ 10 మంది శిశువుల‌ కుటుంబాల‌కు మ‌హారాష్ట్ర స‌ర్కారు రూ.5 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం చెల్లించ‌నుంది. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స్థాయి విచార‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక‌రే సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.