అధిక కట్నాల కోసమే డాక్టర్ చదువు: ఝార్ఖండ్ ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి వివాదాస్పద వ్యాఖ్యలు

09-01-2021 Sat 08:20
  • కొత్తగా నియమితులైన వైద్యులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యాఖ్యలు
  • చర్యలు తీసుకోవాలంటూ సీఎంకు లేఖ రాసిన ఐఎంఏ
  • ఇవి తీవ్ర అవమానకర వ్యాఖ్యలంటూ ఆవేదన
People Become Doctors to Get Good Dowry

అధిక కట్నాల కోసమో, పనిచేయకుండా ఉండడం కోసమో చాలామంది వైద్య వృత్తిని ఎంచుకుంటున్నారంటూ ఝార్ఖండ్ ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నితిన్ కులకర్ణి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైద్యులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన ఆయనపై చర్యల కోసం వైద్య  సంఘాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నాయి.  

కొత్తగా నియమితులైన వైద్యులను ఉద్దేశించి డాక్టర్ నితిన్ కులకర్ణి మాట్లాడుతూ.. పని చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి కొందరు, ఎక్కవ కట్నం తీసుకోవచ్చన్న ఆశతో మరికొందరు వైద్య వృత్తిని ఎంచుకుంటున్నారని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన వ్యాఖ్యలు వైరల్ కావడంతో దుమారం రేగింది.

డాక్టర్ కులకర్ణి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు లేఖ రాసింది. కరోనా సమయంలో ముందుండి పనిచేసిన వైద్యులపై ఇలాంటి వ్యాఖ్యలు తగవని, కరోనా రోగులకు సేవలు అందిస్తూ 734 మంది వైద్యులు, సిబ్బంది చనిపోయారని గుర్తు చేసింది. అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ఆయనపై సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.