వలలో చేపకు బదులు డాల్ఫిన్.. దారుణంగా హింసించి చంపిన వైనం.. వీడియో వైరల్!

09-01-2021 Sat 07:55
  • ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఘటన
  • కత్తులు, కర్రలు, గొడ్డలితో దాడి 
  • ముగ్గురు నిందితుల అరెస్ట్
Gangetic dolphin beaten to death in UPs Pratapgarh

నేరాలకు అడ్డాగా మారుతున్న ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన జరిగింది. తమ వలలో చేపకు బదులు డాల్ఫిన్ పడడాన్ని జీర్ణించుకోలేకపోయిన యువకులు దానిని అత్యంత దారుణంగా హింసించి చంపారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

ప్రతాప్‌గఢ్ జిల్లా కొఠారియా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు శారద కెనాల్‌లో చేపల వేటకు వెళ్లారు. వారి వలలో పెద్ద చేప చిక్కడంతో బయటకు లాగిన వారు వలలో ఉన్న ఐదడుగుల డాల్ఫిన్‌చూసి నిరుత్సాహానికి గురయ్యారు. ఆపై ఆగ్రహంతో దానిపై దాడి చేశారు. కర్రలు, గొడ్డలి, కత్తులతో దానిని హింసించారు.

డాల్ఫిన్‌పై జరుగుతున్న దాడిని చూసిన ఓ వ్యక్తి ఎందుకలా దానిని అకారణంగా హింసిస్తున్నారంటూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ పట్టించుకోని వారు కత్తితో దాని పొట్టను చీల్చారు. దీంతో ఆ ప్రాంతమంతా రక్తంతో నిండిపోయింది. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

డాల్ఫిన్‌ను చంపడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. 5 అక్టోబరు 2009లో డాల్ఫిన్‌ను ప్రభుత్వం జాతీయ జలచరంగా ప్రకటించింది.