పుదుచ్చేరి కలెక్టర్‌పై విషప్రయోగానికి యత్నం.. కేసు నమోదు చేసిన సీబీ సీఐడీ

09-01-2021 Sat 06:59
  • సమావేశంలో మంచినీటి బాటిళ్లు అందించిన సిబ్బంది
  • కలెక్టర్ మూత తెరవగానే రసాయనం వాసన
  • తీవ్రంగా ఖండించిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ
Staff Serves Toxic Liquid In Mineral Water Bottle To Puducherry Collector

పుదుచ్చేరి కలెక్టర్ పూర్వగార్గ్‌పై విష ప్రయోగానికి యత్నం జరిగినట్టు వార్తలు గుప్పుమన్నాయి. రంగంలోకి దిగిన సీబీ సీఐడీ అధికారులు ఈ అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..  పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి నారాయణస్వామి నేతృత్వంలో రాజ్‌నివాస్ ఎదుట నిన్న ఆందోళన చేపట్టారు. ఆందోళన నేపథ్యంలో రాజ్‌నివాస్ వద్ద బందోబస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు గురువారం కలెక్టరేట్‌లో అధికారులు సమావేశమయ్యారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులకు ‘స్విస్ ఫ్రెష్’ అనే ప్రైవేటు కంపెనీకి చెందిన తాగునీటి బాటిళ్లను సిబ్బంది అందించారు. మంచి నీళ్లు తాగేందుకు కలెక్టర్ పూర్వగార్గ్ బాటిల్ మూత తెరవగానే ఏదో రసాయనం కలిపిన వాసన వచ్చింది. దీంతో అనుమానించిన ఆయన ఆ నీటిని తాగకుండా అధికారులకు అప్పగించి విషయం చెప్పారు. విచారణ జరపాలని ఆదేశించారు.

కలెక్టర్‌కు ఇచ్చిన బాటిల్ తప్ప మిగతా సీసాల్లో స్వచ్ఛమైన నీరే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. డీజీపీ బాలాజీ శ్రీవాస్తవ ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించినట్టు బేడీ తెలిపారు.